పాలకొండ: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పించిన రుణమాఫీలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత రెండు విడతల్లో నమోదైన తప్పులే పునరావృతమయ్యాయి. గతంలో రైతుల నుంచి వివరాలు సేకరించి సరి చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మూడో విడతలో జిల్లాలో 15వేల మందికి లబ్ధిచేకూరుతుందని అధికారులు ప్రకటిస్తున్నారు. గతంలో రుణ మాఫీ వర్తించని దాదాపు 40వేల మంది రైతులు తప్పులు సరి చేయమంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎవ్వరికీ మూడో విడతలో మాఫీ కాలేదు.
ఫిర్యాదులు ఏమయ్యాయి..
ప్రభుత్వ ఆదేశాలతో గత నెల వరకు అధికారులు హడావుడిగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రోజుల తరబడి రైతులు ఈ కేంద్రాల చుట్టూ తిరిగి అవస్థలు పడి ఆధారాలు అందించారు. ప్రస్తుతం దీని ప్రకారమే మూడో విడత ప్రకటించినట్లు చెబుతున్నారు. మరి రైతులు అందించిన ఫిర్యాదులు ఏమి అయ్యాయి.. ఎందుకు సరి చేయలేదన్నదానికి అధికారుల వద్ద సమాధానం లేదు.
మేము సరి చేశాం..
బ్యాంకులకు వచ్చిన వివరాల ప్రకారం రైతు ఖాతాల్లో వివరాలు సరి చేశాం. సుమారు 3వేల ఖాతాలకు రైతుల జాబితాలను అనుసంధానం చేశాం. అయినా రుణ మాఫీ జాబితాలో తమ పేర్లు లేవని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశాం. ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం.
- ఎస్.మదుసూదన్- స్టేట్‌బ్యాంకు మేనేజర్, పాలకొండ
రైతులను మభ్యపెడుతున్నారు.
ప్రభుత్వం రుణ మాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోంది. తప్పును బ్యాంకర్ల మీదకు నెట్టివేసే ప్రయత్నం చేస్తోంది. సవాలక్ష నిబంధనలతో 20 శాతం రైతులకు కూడా రుణమాఫీ వర్తించకుండా చేశారు. అందులోనూ మాఫీ అయిన మొత్తం రైతులు వడ్డీకే చాలడంలేదు. ఖరీఫ్‌లో రైతులకు రుణమాఫీ కాలేదు. కొత్త రుణం మంజూరు కాలేదు. కేవలం మాఫీ పేరును ప్రకటనలకే పరిమితం చేశారు.
- విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ
- రేగిడి మండలం బొడ్డవలసకు చెందిన మజ్జి మోహనరావు పాలకొండ స్టేట్‌బ్యాంకులో 4.93 ఎకరాల భూమిపై రుణం తీసుకున్నారు. మొదటి విడత రుణమాఫీ సమయంలో ఈయనకు రెండు ఎకరాల పొలం మాత్రమే ఉన్నట్టు చూపించారు. ఆయన రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే సర్వే నంబర్ల ప్రకారం ఆయన భూమికి సంబంధించిన వివరాలతో తహశీల్దారు ధ్రువపత్రాలు జారీ చేశారు. ఈ ధ్రువపత్రం జత చేసి బ్యాంకుకు సమర్పించటంతో రుణ మాఫీ అవుతుందని ఆశించారు. ప్రస్తుతం మూడో విడతలోను ఆయనకు రెండెకరాలే ఉన్నట్టు చూపిస్తున్నారు.
- సరుబుజ్జిలి మండలం కొత్తకోటకు చెందిన సురవరపు కృష్ణారావుకు మొదటి, రెండో విడతల్లో ఆధార్, రేషన్ కార్డుల నంబర్లు తేడాగా ఉన్నాయంటూ మాఫీ వర్తింపచేయలేదు. దీంతో ఆయన ఆ వివరాలు తీసుకుని జిల్లా కలెక్టర్‌కు, అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. వారు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి, బ్యాంకుకు సమాచారమిచ్చి సరి చేశామని సెల్‌ఫోన్‌కు మెసేజ్ పెట్టారు. తాజాగా ప్రకటించిన మూడో విడతలోనూ ఆయనకు మొండి చెయ్యే ఎదురైంది. ఆయన బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నిస్తే తాము సరి చేసినట్టు ధ్రువపత్రం అందించారు. ఇదీ రుణమాఫీ పథకంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలు. వీరిద్దరే కాదు ఎంతో మందిరైతులకు లేనిపోని ఆంక్షలు చూపి రుణమాఫీ వర్తింపజేయకుండా జాప్యం చేస్తున్నారు.
మూడో విడతలోనూ మతలబే..
Published Thu, Aug 13 2015 12:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement