వరించని వరుణుడు
- వర్షాల్లేక అదును మీరిన ఖరీఫ్ వరి
- ఎదగని నారు చూసి రైతుల గగ్గోలు
- వర్షాధార భూములకు బోర్లే శరణ్యం
- 7 గంటల విద్యుత్‌కు అన్నదాతల మొర
చోడవరం: ఖరీఫ్ వరికి అదును మీరడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మొదట్లో వర్షాల్లేక ఆలస్యంగా వరి నారుమడులు వేయడంతో ఇప్పుడు నారు ఎదగడం లేదు. వాస్తవానికి 21 రోజుల్లో నారు ఎదిగి నాట్లకు సిద్ధం కావాలి. కాని తుపాను వర్షాలు కూడా సరిగ్గా కురవకపోవడంతో నారు కనీస ఎదుగుదల లేక ఉంది. దీనికి తోడు తెగులు బారిన పడి పలుచోట్ల నారుమళ్లలో ఆకు ఎర్రగా మారిపోయింది. వర్షాలు ఇలాగే ఉంటే బోర్లను ఆశ్రయించక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయానికి దమ్ములు పట్టి, నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. కానీ నారే ఎదగకపోవడంతో కనీసం నాట్లయినా పడలేదు. జలాశయాల కింద సైతం నారు పడకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో మునుపెన్నడూ లేనివిధంగా రైతుల డిమాండ్ మేరకు నాట్లు వేసేందుకు పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల నుంచి నీరు విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పెద్దేరు జలాశయం నుంచి 30 క్యూసెక్యుల నీరు విడుదల చేయక, కోనాం జలాశయం నుంచి సోమవారం 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. త్వరలో రైవాడ నీటిని కూడా విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
జలాశయాల ఆయకట్టు రైతులకు ఈ పరిణామం కొంత ఉపశమనం కలిగించినా వర్షాధారం, నదులు, కొండగెడ్డలపై ఆధారపడ్డ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో రైతులు నాట్లు ఎలా వేయాలని ఆలోచిస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజులు చూసి బోర్ల సాయంతోనైనా నాట్లు వేయక తప్పదని రైతులు చెబుతున్నారు. మరోపక్క నారుమడికి తెగుళ్లు రావడం, నారు ఎదగకపోవడంతో ఎరువులు, పురువుగు మందులు వేసేందుకు సైతం నీరు అవసరం కావడంతో రైతులు సాగునీటి కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి నిర్ణీత 7 గంటల విద్యుత్‌ను నిరాటంకంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.