ఎడ్ల బళ్ల పోటీలకు చోడవరం, మాడుగుల పరిసర ప్రాంతాలు సిద్ధం
చోడవరం: ధాన్య, ధన రాశులతో తులతూగుతూ రైతులు ఆనందంగా ఉన్న రోజుల్లో వచ్చే సంక్రాంతి పండగ ఎన్నో సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలకు నెలవుగా ఉంటుంది. ఎన్నో పల్లె సంప్రదాయాలు కనుమరుగవుతున్నప్పటికీ ఇప్పటికీ పల్లె క్రీడలు కొన్ని జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎడ్లబళ్ల పోటీఉ, కోడిపందాలు, గుర్రాల పరుగు పోటీలు పల్లెల్లో సంక్రాంతి శోభను ఇనుమడింపజేస్తాయి. కోడిపందాలపై నిషేధం విధించడంతో సంక్రాంతి పండగంతా ఎడ్ల బళ్ల పరుగు పోటీల వైపే ఆసక్తిగా చూస్తుంది.
కనుమ పండగ నుంచి ప్రారంభమయ్యే ఈ ఎడ్ల బళ్ల పోటీలు తీర్ధాలు, గ్రామదేవల పండగల సందర్భంగా కూడా నిర్వహిస్తారు. పెద్దపండగ వచ్చిందంటే ఎడ్లబళ్ల పోటీల కోసం జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడ్లబళ్ల పోటీలు ప్రధానంగా చోడవరం, మాడుగుల పరిసర మండలాలైన దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, వూడుగుల, సబ్బవరం, చోడవరం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, రావికమతం మండలాల్లో జరిగేవి. క్రమేణా రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలి, నక్కపల్లి, కశింకోట, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, కోటవురట్ల తదితర మండలాలకు విస్తరించాయి.
కొందరైతే ప్రత్యేకంగా ఈ సంక్రాంతిలో ఎడ్ల బళ్ల పోటీల కోసమే ఒంగోలు, మైసూర్‌తో పలు మేలుజాతి ఎడ్లను లక్షలాది రూపాయలు ఖర్చుచేసి మరీ కొనుగోలు చేసి వాటికి శిక్షణ ఇస్తారు. హింస, జూదానికి తావు లేకుండా కేవలం ఆటవిడుపుగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నింపే విధంగా గెలుపే లక్ష్యంగా పోటీ ప్రతిష్టతో నిర్వహించే ఈ ఎడ్ల బళ్ల పరుగుల పోటీలు క్రీడాస్ఫూర్తితో జరుగుతాయి. అందుకే ఈ పోటీలకు ప్రజల నుంచి విశేష స్పందన ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ పోటీల సమయానికి సందర్శకులు చేరుకుని ఉత్సాహంగా పోటీలను తిలకిస్తారు.
పోటీలు ఇలా...
పందెంలో పాల్గొనే ఎడ్ల (జత)ను ఎంట్రీల ప్రకారం వరుస నంబర్లు వేసి తేలికపాటి ఎడ్లబళ్లకు ఎద్దులను బూసి పరుగెత్తిస్తారు. ఒక్కో బండి నిర్వహణకు ఇద్దరు వునుషులు ఉంటారు. ఏ ఎడ్లబండి తక్కువ సమయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకొని తిరిగి వస్తుందో ఆ ఎద్దులు విజయం సాధించినట్టుగా పరిగణిస్తారు. కొన్ని ప్రదేశాల్లో నాలుగైదు ఎడ్లబళ్లను ఒకేసారి మైదానంలో ఉంచి పరుగుల పోటీ నిర్వహిస్తారు. ఈ తరహా పోటీలు తక్కువగా ఉండగా ఒక్కో బండి పరుగుతీసే పోటీలే ఎక్కువగా జరుగుతుంటాయి. పోటీలో గెలుపొందిన ఎద్దులకు ముందుగా నిర్ధేశించిన పారితోషకాన్ని బహుమతిగా ఇస్తారు.
పోటీలో పాల్గొనే ఎడ్లబళ్లు
వుంచి వయస్సులో మేలుజాతి హుషారైన ఎద్దులను ఈ పోటీలకు దించుతారు. పందెం సమయంలో బండి బోల్తా పడినా ఎద్దులకు గానీ ఎవరికీ పెద్దగా ప్రమాదం కలగజేయకుండా ఉండే తేలికపాటి బళ్లను ఉపాయోగిస్తారు. ఈ పోటీల కోసం తేలికగా ఉండి ప్రత్యేకంగా బేరింగ్‌లు వేసిన చక్రాలను ఈ బళ్లకు ఏర్పాటు చేస్తారు. ఒక వేళ పోటీల్లో బండి బోల్తా పడినా వెంటనే నిర్వాహకుడు బండి తిరిగి లేపి పరుగు తీసే విధంగా అత్యంత తేలిగ్గా బండి తయారు చేస్తారు.
పోటీలకు ఆటస్థలం
రైతుతో ముడిపడి నిత్యం రైతుతోనే కలిసి ఉండే ఎడ్లబండితోఎద్దులు పరుగెత్తే ఈ పోటీలో పాఠశాలల్లోను, ఆట స్థలాల్లోను నిర్వహించరు. ఎద్దులు, రైతులు నిత్యం కలియతిరిగే పంట పొలాల్లోనే ఈ పోటీలు నిర్వహిస్తారు. జనవరి నెల ప్రారంభానికి ఖరీఫ్ వరిపంట కోతలు పూర్తవ్వడంతో చాలా పొలాల్లో సంక్రాంతి పండగ జరిగే వరకు ఏ పంట వేయరు. దీంతో కోతలు జరిగిపోయి ఖాళీగా ఉన్న పొలాలను నిర్దేశించిన లక్ష్యం మేర పొలాల మడుల మధ్య ఉన్న గట్లను తొలగించి ఎడ్లపందాలు నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల్లో సమీపంలో నీరులేని సాగునీటి చెరువుల్లో కూడా నిర్వహిస్తారు. రైతులంతా పిల్లా పాపలతో ఉరకలెత్తుతున్న ఎడ్లను తిలకించి వాటికి మరింత ప్రోత్సాహం ఇస్తూ చప్పట్లు కొడుతూ ప్రదర్వనను ఆస్వాదిస్తారు. పోటీలు నిర్వహించే టప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగా అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తారు.
ఎన్నో బహుమతులు గెలుచుకున్నా...
నేను పొలం పనులతో పాటు ఎడ్ల బళ్ల పోటీలపై ప్రధానంగా దృష్టి పెట్టి మేలు జాతి ఎద్దులను పెంచుతున్నాను. నా దగ్గర రెండు జతల మేలు జాతి ఎద్దులు ఉన్నాయి. వీటి పెంపకానికి రోజూ భారీగానే ఖర్చవుతుంది. ఏటా జరిగే పందాల్లో 80 నుంచి 110 వరకు పోటీల్లో నా ఎద్దులు ఎక్కువసార్లు మొదటి బహుమతులు తెచ్చాయి. జిల్లా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరితోపాటు రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం నా ఎద్దులు బహుమతులు గెలుచుకున్నాయి. గతేడాది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో వరుసగా మొదటి, రెండో బహుమతులు గెలుచుకున్నాయి. –లెక్కల సత్తిబాబు, లెక్కలవానిపాలెం, చోడవరం
పెంపకంలో జాగ్రత్తలు
వ్యవసాయంలో నాతో కలిసి జీవించే ఎద్దులు పోటీల్లో పరుగులు తీస్తుంటే ఆ ఆనందం చెప్పలేను. రూ.లక్షా 60వేలుపెట్టి ఎద్దులు కొన్నాను. వీటి పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటాను. మంచి పోషాకాహారంతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా అవసరం. ఇప్పటి వరకు అనేక పందాల్లో బహుమతులు సాధించాను. ఈ ఏడాది మరిన్ని పోటీలు గెలవాలని ఉత్సాహంగా ఉన్నాను.
–ముమ్మిన రామకృష్ణ, ఎడ్లపెంపకందారుడు, నర్సయ్యపేట
Comments
Please login to add a commentAdd a comment