చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!: సీఎం జగన్‌ | AP Elections 2024: CM YS Jagan Public Meeting Speech at Chodavaram | Sakshi
Sakshi News home page

చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!: చోడవరం ప్రచార సభలో సీఎం జగన్‌

Published Mon, Apr 29 2024 11:39 AM | Last Updated on Mon, Apr 29 2024 3:22 PM

AP Elections 2024: CM YS Jagan Public Meeting Speech at Chodavaram

అనకాపల్లి, సాక్షి: చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అ‍న్నారు.  జరగబోయే ఎన్నికలు  ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.

‘‘జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే.. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా? అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్‌.(అందుకు సిద్ధం అని సమాధానం వచ్చింది)

మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా.

రుణమాఫీ అంటూ రైతుల్ని మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీల పేరుతో మోసం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్‌ రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారు. తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోవిందా.. గోవిందా. 2014 టైంలో ఇదే కూటమి మన ముందుకు వచ్చింది. హామీల పేరుతో పెద్ద మోసం చేసింది. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటున్న చంద్రబాబును నమ్మొచ్చా?.

బాబు అధికారంలో ఉంటే వర్షాలు గోవిందా.. రిజర్వాయర్‌లలో నీళ్లు గోవిందా. ఓటుకు నోటుకేసులో అడ్డంగా దొరికిపోయి.. మన రాజధాని గోవిందా. గ్రాఫిక్స్‌ రాజధాని కూడా గోవిందా.. గోవిందా. సింగపూర్‌ను మించిన రాజధాని అంటూ విశాఖను వదిలేశారు. కేంద్రంతో రాజీ పడి.. ప్రత్యేక హోదా గోవిందా.. గోవిందా. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా?. 

ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగా ఓటేయాలని, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరిగిందో ఆలోచన చేయండని సీఎం జగన్‌, చోడవరం వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు.

చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!: సీఎం జగన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement