=నదులు, కాలువ గట్ల పటిష్టం నామమాత్రం
=నాణ్యతలేని పనులతో ఏటా ఇబ్బందులే..
=శాశ్వత చర్యలు చేపట్టని ప్రభుత్వం
యలమంచిలి/చోడవరం, న్యూస్‌లైన్: వరదలప్పుడు కొట్టుకు పోయిన గండ్లు పూడ్చడంలో పాలకుల నిర్లక్ష్యం రైతులు, ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. ముంపు బారి నుంచి తప్పించడానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టడంలేదు. వరదలు ముంచెత్తాక నదులు, కాలువల గట్లను పటిష్టం చేస్తామన్న ప్రకటనలే తప్ప.. ఆచరణ శూన్యం. గతేడాది నీలం తుఫాన్, నెలరోజుల కిందట వరదలకు జిల్లాలో 97చెరువులకు, పెద్దేరు, తాచేరు, సర్పానది, వరహా, బొడ్డేరు, శారదా నదులకు 24చోట్ల, గెడ్డలకు 87 ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి.
వర దనీరు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వీటిలో సగానికి పైగా నీలం తుఫాన్‌కు దెబ్బతిన్నవే. వీటిలో కొన్నింటిని నామమాత్రంగా ఇసుక బస్తాలు పేర్చి వదిలేశారు. మరికొన్నింటిని పూడ్చలేదు. ఇటీవల వరదలప్పుడు పంటపొలాలతోపాటు పట్టణాలు, గ్రామాలు మళ్లీ ముంపునకు గురయ్యాయి. రైవాడ రిజర్వాయర్ నుంచి విశాఖ కార్పొరేషన్‌కు తాగునీటిని సరఫరా చేసే కాలువకు నాగయ్యపేట, సీతంపేట వద్ద, ఎడమ కాలువకు బేదపూడి వద్ద పడిన గండ్లను ఇప్పటికీ పూడ్చలేదు.
చోడవరం మండలం పీఎస్‌పేట, రామజోగిపాలెం, జన్నవరం వద్ద పెద్దేరు నదికి గండిపడిన ప్రదేశాలను పూడ్చలేదు. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కాలువలు, ఆనకట్టలు, గ్రోయిన్ల ఆధారంగా జిల్లాలో 98,144 ఎకరాల్లో పంటలు చేపడుతున్నారు. వాటికి గండ్లు పడకుండా అన్నదాతలు ఇసుకబస్తాలతో రేయింబవళ్లు కాపలా కాయవలసివస్తోంది. అప్పుడు వారు ప్రమాదాలకూ గురవుతున్నారు. 2011 నవంబరులో తుఫాన్ సమయంలో రూ.80 కోట్లతో గట్లు పటిష్టానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. వాటికి అతీగతీ లేకుండా పోయింది.
గత నెలలో వచ్చిన వరదలతో వీటి పటిష్టత విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.114 కోట్లతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు 645 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరణకు రూపొందించిన ప్రణాళికలు ప్రభుత్వానికి చేరాయి. నెలరోజులు తిరక్కుండానే మరోసారి హెలెన్ రూపంలో తుఫాన్ ముంచుకొచ్చింది. అంతో ఇంతో వరదనీరు గతంలో గండ్లు పడిన ప్రదేశం నుంచి పంటపొలాలను మళ్లీ ముంచెత్తింది. ముఖ్యంగా ఆనకట్టలు, కాలువల మరమ్మతుల పనుల్లో నాణ్యత కొరవడి ఖరీఫ్ వరి ముంపునకు గురయింది. ఇలా ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఏటా రైతులు పంటలను కోల్పోతున్నారు. పనులు పటిష్టంగా చేపడితే ఈ పరిస్థితి ఉండేది కాదన్న వాదన వ్యక్తమవుతోంది.
గతేడాది పనుల నాణ్యతను పరిశీలిస్తే....
నీలం తుఫాన్‌లో దెబ్బతిన్న యలమంచిలి శేషుగెడ్డ, మైనర్ శారద నది కాలువ గండ్లు పూడ్చివేత పనులను చెరో రూ.25లతో చేపట్టారు. శేషుగెడ్డ కాలువకు ఒకవైపు మాత్రమే గట్టును పటిష్టంచేయడం, పనుల్లో నాణ్యతలేకపోవడంతో గత నెలలో భారీ వర్షాలకు వరదనీరు ముంచెత్తింది. యలమంచిలి పట్టణానికి భారీ నష్టం వాటిల్లింది. మైనర్‌శారద కాలువ గండ్లు కూడా కొట్టుకుపోయాయి. పనుల్లో నాణ్యతలేదని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమయినప్పటికీ అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో ఈ ఏడాది కూడా రైతులు పంటలు కోల్పోవలసి వచ్చింది. పురుషోత్తపురం గెడ్డకు రు.6లక్షలతో మరమ్మతు పనుల్లోనూ ఇదే దుస్థితి.
తీరని కడగండ్లు
Published Sun, Nov 24 2013 2:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement