పాలకొండలో.. ఇసుక తుపాను !
పాలకొండ:పాలకొండలో ఇసుక తుపాను రేగింది. నాటుబళ్లతో ఇసుక తరలించుకొనేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలపై నాటుబళ్ల యజమానులు మండిపడ్డారు. సర్కారు తీరును నిరసిస్తూ బళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగావళి నది నుంచి పలువురు సన్న, చిన్నకారు రైతులు నాటుబళ్లతో ఇసుకను తరలిస్తూ వచ్చే సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో వీరంతా ఆందోళన బాట పట్టారు. వీరఘట్టం రోడ్డులో ఉన్న మార్కెట్ కమిటీ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు 200 నాటుబళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీన్ని పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. పట్టణంలో తీవ్ర గందరగోళంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ఎస్సై ఎల్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
కోటదుర్గమ్మ ఆలయ కూడలి నుంచి సగం బళ్లను పట్టణంలోని పలు వీధులకు మళ్లించారు. బళ్లు మొత్తం పట్టణంలోకి ప్రవేశిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఎస్సై వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధితుల తరఫున నగర పంచాయతీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పల్లా కొండలరావు జోక్యం చేసుకొని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, వారిని అడ్డుకోవద్దని పోలీసులకు కోరారు. అయినా పోలీసులు బళ్లు అన్నింటినీ ఒకే రహదారిలో వెళ్లనీయకుండా పలు వీధులకు 20, 30 చొప్పున మళ్లించారు. అయినా వీరంతా నాగవంశపువీధి కూడలిలో మెయిన్‌రోడ్డుపైకి చేరుకొని..అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయానికి తరలించారు.
ఈ సందర్భంలో ఎస్సైకు, బళ్ల యజమానులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదంటూ ఎస్సై కోపోద్రిక్తుడు కావడంతో వీరు కూడా ససేమిరా అంటూ ఈ ఒక్కరోజుకు సహకరించాలని కోరారు. అనంతరం బళ్లను నిలిపివేసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయూలని కోరుతూ కార్యాలయ ఏవో దాలినాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బళ్ల సంఘం అధ్యక్షుడు ఇద్దుబోయిన తవుడు మాట్లాడుతూ రోజంతా కష్టపడితే రూ.200 సంపాదిస్తున్నామని, పశువుల దాణా పోనూ ఉన్న వంద రూపాయలతో కుటుంబాలతో నెట్టుకొస్తున్నామన్నారు. అలాంటిది తమ నుంచి బండికి వెరుు్య రూపాయలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. ఈ చర్యను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, శనివారం సైతం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.