హెలెన్ తుపానునిండా ముంచింది | The influence of the storm rainfall across the district | Sakshi
Sakshi News home page

హెలెన్ తుపానునిండా ముంచింది

Published Sun, Nov 24 2013 1:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

The influence of the storm rainfall across the district

=తుపాను ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు
 =2.25 లక్షల ఎకరాల్లో వరి నీటమునక
 =అప్పులే మిగులుతాయని అన్నదాతల ఆవేదన
 =గుండె ఆగిన కౌలు రైతు
 =వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
 =వాగుల్లో ఇద్దరి గల్లంతు
 

 హెలెన్ తుపాను అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికందే తరుణంలో నీటమునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి నీటమునిగినట్లు వ్యవసాయ అధికారుల అంచనాగా ఉంది. పంట దెబ్బతినడంతో తట్టుకోలేక కౌలురైతు గుండె ఆగి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి ఇద్దరు, చలిగాలులకు ఇద్దరు వేర్వేరు చోట్ల చనిపోయారు. మరో ఇద్దరు వాగుల్లో గల్లంతయ్యారు.
 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను జిల్లా రైతును నిండా ముంచింది. శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, గాలుల ప్రభావానికి కోతకు సిద్ధమైన వరి చేలు నేలవాలి నీటమునిగాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా హెలెన్ తుపాను ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లోని వరి నీటమునిగిందని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేశామని, పంట చేతికొచ్చే దశలో తుపాను ప్రభావంతో వీచిన బలమైన గాలులకు పంట నేలవాలటం, దానిపై నీరు చేరటంతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు.

ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి విడుదల ఆలస్యం కావడంతో తక్కువ వ్యవధిలో పంట చేతికొచ్చే బీపీటీ 5204 రకం విత్తనాన్ని జిల్లా రైతులు అత్యధికంగా సాగు చేశారు. ఈ రకం విత్తనం రెండు రోజులకు పైబడి నీటిలో నానితే గింజ కుళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను శుక్రవారమే తీరం దాటినా దీని ప్రభావంతో శనివారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి.

జిల్లాలో అత్యధికంగా పెదపారుపూడిలో 17.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం, అత్యల్పంగా చాట్రాయిలో 0.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 5.7 సెంటీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుపాను  ప్రభావంతో వీచిన బలమైన గాలులకు జిల్లాలోని 500 ఎకరాల్లో అరటితోటలు, 50 ఎకరాల్లో బొప్పాయి తోటలు, 200 ఎకరాల్లో దొండ, బీర పందిళ్లు దెబ్బతిన్నాయి. చినగొల్లపాలెం దీవిలో 200 కొబ్బరిచెట్లు విరిగిపడ్డాయి.
 
 పంట బీమా ఇప్పించాలి...
 ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో పంటలు కోల్పోతే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సకాలంలో అందని దుస్థితి నెలకొంది. హెలెన్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట బీమా ఇప్పించేందుకైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది.
 
 కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం...

 కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల మంది కౌలురైతులు 3.50 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. పంటబీమా, నష్టపరిహారం, కౌలురైతులకు అందే పరిస్థితి లేదు. హెలెన్ తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు నష్టాలే మిగిలే పరిస్థితి దాపురించింది.
 
 పరిహారం అందేనా?
 గత నెల అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టం ఇప్పించాలని రైతులు కోరిన మీదట నీలం తుపాను నష్టపరిహారం ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈలోపే హెలెన్ తుపాను కారణంగా రైతులు మరోసారి నష్టపోయారు. ఈ పంట నష్టం అంచనాలు ఎప్పటికి పూర్తిచేస్తారో పరిహారం ఎప్పటికి అందిస్తారోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలి : నాగిరెడ్డి
 వరుస దెబ్బలతో జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడుతోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హెలెన్ తుపాను తాకిడికి నేలవాలిన పంటలు కుళ్లిపోతాయని, ఈ పంటను కోయకుండానే దమ్ము చేసి దాళ్వా పంట వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంట నష్టపరిహారాన్ని ఎకరానికి రూ.10 వేలు చొప్పున అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
 నేడు వ్యవసాయాధికారుల సమావేశం
 తుపాను ప్రభావంతో ఏర్పడిన పంట నష్టం అంచనాలు, జాబితాల తయారీలో తీసుకోవాల్సిన విధివిధానాలపై జిల్లాలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనాలను తయారుచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.   
 
 నలుగురి మృతి.. ఇద్దరి గల్లంతు
 తుపాను ప్రభావంతో జిల్లాలో శనివారం నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు వాగుల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద తెగిన కరెంటు తీగ తగలడంతో బోత్సా వెంకటరమణ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. హనుమాన్‌జంక్షన్‌లో ట్రినిటీ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహిస్తున్న హాస్టల్‌లో మాదాసు ఆనందరాజు (7) అనే బాలుడు స్నానం చేసేందుకు వెళ్లి వర్షపు నీటిలో జారి మోటారుపై పడ్డాడు. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

తుపాను ప్రభావంతో వీచిన చలిగాలులకు జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. అవనిగడ్డ మండలం బందలాయిచెర్వు దళితవాడలో గొరుముచ్చు పురుషోత్తం (74) శుక్రవారం రాత్రి చనిపోయాడు. నందివాడ మండలం శంకరంపాడులో గుడుమోలు కమలమ్మ (65) శనివారం తెల్లవారుజామున చలిగాలులకు తాళలేక మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

జి.కొండూరు మండలం చెరువుమాధవరం తండా వద్ద పులివాగులో బూక్యా మోతి (35) అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. లోలెవెల్ చప్టా వద్ద వాగును దాటే ప్రయత్నం చేయగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. నందివాడ మండలం ఎల్‌ఎన్‌పురం శివారు ఇమ్మనివానిగూడేనికి చెందిన కోరం ఇస్రాయేలు (70) శనివారం ఉదయం బుడమేరు డ్రెయిన్ దాటుతుండగా వర్షంతో నేల నాని ఉండటంతో కాలుజారి నీళ్లలో పడి కొట్టుకుపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement