చివరికి కన్నీరే!
Published Sun, Nov 24 2013 2:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్టుంది. జల్.. పై-లీన్.. హెలెన్ పేరేదైతేనేం వరుస తుపాన్లు చేతికందే దశలో పంటలను నీటిపాలు చేస్తున్నాయి. ఈ ఏడాది వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లా రైతుకు హెలెన్ ధాటికి ఇప్పటి వరకు కాపాడుకొచ్చిన పంట కూడా దక్కలేదు. ఈదురుగాలులకు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరిపంట నేలవాలింది. కోత కోసిన చేలల్లో వరి ఓదెలు నీటితో తేలియాడుతున్నాయి. గడచిన మూడేళ్లలో ఇంతటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోలేదని డెల్టా రైతులు వాపోతున్నారు. పొలాల్లో పంట స్థితిని చూసి రైతన్న ఆందోళన చెందుతున్నాడు.
జిల్లాలో మూడు రోజులుగా వీస్తున్న ఈదురుగాలులు, కురుస్తున్న వర్షాల ధాటికి 132.5 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. మరో 2180 ఎకరాల్లో కాయదశకు వచ్చిన మినుము పంటకు నష్టం వాటిల్లినట్టు తేల్చారు. డెల్టాలోని తెనాలి, కొల్లిపర, కొల్లూరు, వేమూరు, చుండూరు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పొన్నూరు మండలాలు, పల్నాడులోని నరసరావుపేట, సత్తెనపల్లి కాగా మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లో వరి రైతులు నష్టాన్ని చవిచూశారు. కొందరు రైతులు నేలవాలిన వరి దుబ్బులను నిలగట్టే పనిలో తలమునకలయ్యారు. వర్షం కొనసాగితే నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. పత్తి పంటతోపాటు పసుపు, తమలపాకుల తోటలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆందోళనలో పత్తి రైతులు
ఇటీవల కురిసిన వర్షాలకు కేవలం 65 వేల ఎకరాల్లోనే 50 శాతానికి మించి నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపిన సంగతి తెలిసిందే. పల్నాడులో ఇప్పటికే తీసిన మైల(మొదటి) పత్తిని బోరాల్లో నిల్వ ఉంచారు. బోరాల్లోకి కూడా నీళ్లు చేరి తడిసిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే పత్తి దిగుబడుల్లో నాణ్యత లేదని సీసీఐ సైతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావడంలేదు. ప్రయివేటు వ్యాపారులు క్వింటా పత్తి రూ.1400కు ఇస్తారా..రూ.1500కు కొనుగోలు చేస్తామంటూ.. రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. కనీసం కూలీల ఖర్చులైనా వస్తాయనుకుంటే హెలెన్ ముసురు నిరాశే మిగిల్చింది.
పట్టించుకునే నాథుడెవ్వడు..
వరుస తుపానుల ప్రభావానికి పంటలు నష్టపోయిన తమను అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదని జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పైలీన్ తుపాను, అధికవర్షాల నేపథ్యంలో జిల్లాలో పర్యటించిన కేంద్ర కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలవుతాయనే ఆందోళన అందరిలోనూ ఉంది. వరుస తుపాన్లతో రైతులు నష్టాలపాలైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనగా ఉద్యమాలు తప్పవని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Advertisement
Advertisement