సాక్షి, హైదరాబాద్: హెలెన్ తుపాను వల్ల కోస్తా జిల్లాల్లో రూ.1,630 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ పార్థసారథి తెలిపారు. తుపాను పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. హెలెన్ తుపాను వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఐదు జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని చెప్పారు. 10,003 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
రహదారులు, భవనాలు దెబ్బతిని రూ.177 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 1,313 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 24 పడవలు కొట్టుకుపోగా మరో 234 పడవలు దెబ్బతిన్నాయని తెలిపారు. విద్యుత్తు, మంచినీటి సరఫరా నిలిచిపోయిన 166 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.