=ఎకరాకు రూ.10 వేలు పరిహారమివ్వాలి
=రుణాలు రద్దు చేయాలి
=వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ భాను డిమాండ్
=పెడన, పామర్రు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటచేల పరిశీలన
పెడన/ పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పెడన నియోజకవర్గంలో గూడూరు, పెడన మండలాల్లో ముంపుబారిన పడిన పొలాలను పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, రాములతో కలిసి పర్యటించారు.
పామర్రు మండలంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పనతో కలసి దెబ్బతిన్న పంటచేలను పరిశీలించారు. ఈ సందర్భంగా పెడన, పామర్రులలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల పాలనలో నాలుగుసార్లు తుపానులు వచ్చాయన్నారు. జల్ తుపాను బాధిత రైతులకు నేటికీ ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కాలేదని విమర్శించారు. పై-లిన్ తుపాను అనంతరం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు.
హెలెన్ తుపానుకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని, రుణాలు మాఫీ చేయాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో అధికారంలోకి వస్తే క్వింటా ధాన్యం మద్దతు ధర రూ.2 వేలు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొందని, ఆంధ్రప్రదేశ్‌లో అదే ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవటం అన్యాయమని విమర్శించారు. రైతులకు పెద్దపీట వేసింది ఒక్క వైఎస్సారేనని చెప్పారు. హెలెన్ తుపాను వల్ల మృతిచెందిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు పక్షాన పోరాడేది వైఎస్సార్‌సీపీ ఒక్కటే : నాగిరెడ్డి
రైతన్నల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. హెలెన్ తుపాను వల్ల సన్న, చిన్న కారు, కౌలు రైతులు సర్వం కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆత్మహత్యలే శరణ్యమంటూ విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలిచి వారితో కలిసి పోరాటం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని భరోసా ఇచ్చారు. నవంబర్ వచ్చినా దాళ్వా ఉందో లేదో చెప్పలేదన్నారు.
ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని, ఇటు అధికారులు, అటు మంత్రులు రైతులను విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. తుపాను వల్ల దెబ్బతిన్న రైతులకు రెండో పంటకు రుణం ఇచ్చే నాథుడే కరువయ్యాడని చెప్పారు. రైతుల రుణాలు వెంటనే రద్దుచేసి, నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రెండో పంటకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని ఆయన కోరారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.2 వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
రైతన్నను ఆదుకోండి
Published Tue, Nov 26 2013 1:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement