జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఉదయభాను, రక్షణనిధి
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట అర్బన్: తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. మండలంలోని అనుమంచిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలను తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి ఉదయభాను ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులు తీవ్ర అవమానాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడటం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరిచేలా మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చింతమనేని దౌర్జన్యాలకు అంతం లేకుండా పోయిందని, కనీసం ఆయనపై చర్యలు తీసుకోవడానికి కూడా సీఎం ప్రయత్నించకపోవడం ఆయన చేతగాని తనాన్ని, దళితులపై ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో తెలియజేస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాటి పాలన రావాలంటే ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అట్టడుగున ఉన్న దళితులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. జగ్జీవన్‌రామ్ దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ యువ నాయకుడు సామినేని ప్రశాంత్‌బాబు, మాజీ ఎంపీపీ మాతంగి వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నాయకులు పగిడిపల్లి సునిల్‌కుమార్, తుమ్మల ప్రభాకర్, బూడిద నరసింహారావు, మార్కపూడి గాంధీ, పాతకోటి ఉదయభాను, ఆకారపు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment