
సాక్షి, విజయవాడ : కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. గురువారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని తెలిసే చంద్రబాబు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుని.. ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
‘చంద్రబాబు జూన్ 8 వరకు నేనే సీఎం అంటూ రివ్యూలు చేస్తున్నారు. అనేక మంది ఉద్యోగులకు మీరు జీతాలు ఇవ్వాలి. ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. మీరేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద కూడా నిందలు వేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గవర్నర్ ని కలవడం కూడా తప్పే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు నువ్వు ఎవరిని నమ్ముతావు బాబు’ అని ఉదయభాను ప్రశ్నించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు రోజులు దగ్గర పడ్డాయని, అధికారంలోకి వచ్చాక నీపై అన్ని విధాలుగా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం..
చంద్రబాబు ఇంటికి వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. ఐదేళ్లు చంద్రబాబు దుర్మార్గపు పాలన చేశారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుకు కలలో కూడా వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. అక్కా చెల్లెమ్మలు టీడీపీకి ఓటు వేస్తే మీకు ఎందుకు భయం బాబు. కోడెల రిగ్గింగ్ చేస్తుంటే ప్రజలు తిరగబడ్డారు. తిరువూరులో నాపై మంత్రిని పోటీ చేయించారు. అయినా గెలుపు నాదే. ప్రజా తీర్పు మాకే అనుకూలం. వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం. రాజన్న రాజ్యం రావడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment