సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో చేపట్టిన గృహ నిర్మాణం పథకం సరిగా లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ హయాంలో 48 లక్షల ఇళ్లు కట్టించినట్లు గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ.. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం త్వరలోనే 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడామని తెలిపారు. గృహ నిర్మాణంలో అవినీతి జరగకుండా.. గ్రామ వాలంటీర్ల ద్వారా కేటాయింపులు పారదర్శకంగా జరుపుతామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటిని లబ్ధి దారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఇస్తామని వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేకుండా.. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తుందని ఉదయభాను సభలో తెలిపారు. పేదప్రజల పేరు చెప్పుకుని గత ప్రభుత్వం దోపిడికి పాల్పడిందని ఆయన విమర్శించారు. జన్మభూమి కమిటీ కేటాయింపుల్లో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. పేద ప్రజల అభివృద్ధికి కొండంత చెప్పి.. గోరంత చేశారని ఎద్దేవా చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రకటించినట్లు ఎమ్మెల్యే శిల్పారవి స్పష్టంచేశారు. సంక్షేమ ఫలాలు అందించేటప్పుడు కులం, మతం చూడమని అన్నారు. ఐదేళ్ల కాలంలో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు దోపిడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment