
సాక్షి, అమరావతి : వచ్చే నెలలో మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 7,900 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతీ ఏటా జనవరిలో ప్రభుత్వంలోని అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నలకు మంత్రి సురేష్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సురేష్ మాట్లాడుతూ... ప్రతీ ఏడాది జనవరిలో అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా పేదలందరికీ ఇంగ్లీషు మీడియంలో విద్య అందించేలా తమ ప్రభుత్వం విద్యాసంస్కరణలు చేపట్టిందని సభకు తెలిపారు.
గొప్ప నిర్ణయం..
‘పేద విద్యార్థులకు ఇంగ్లీషు విద్యను అందించడమే లక్ష్యం. టీడీపీ హయాంలో భాషా పండితులను విస్మరించారు. అయితే మా ప్రభుత్వం విద్యాశాఖలో భాషా పండితులకు పదోన్నతులు కల్పించింది. మొత్తం 12 వేల మంది భాషా పండితులకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే పరిష్కరించారు. సీఎం నిర్ణయంతో భాషా పండితులంతా సంతోషంగా ఉన్నారు అని సురేష్ వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన సంతోషకరం అని హర్షం వ్యక్తం చేశారు. ఇదొక గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచే ఇంగ్లీషు మీడియం బోధన ప్రారంభించడం శుభ సూచకమని ఆర్కే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment