=హెలెన్‌పై విశాఖ భారీ విక్టరీ
= చివరి క్షణం వరకు మ్యాచ్ జరగడమే మిస్టరీ
=అడ్డంకి లేని వన్డే.. అదో స్వీట్ మెమొరీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కమ్ముకున్న కారు మబ్బులు.. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు.. ఉధృతంగా వీచే ఈదురుగాలులు.. హెలెన్ తుఫాన్ భీకర స్వరూపమిది.. కోస్తాంధ్ర అంతటినీ చిగురుటాకులా వణికించిన పెనుతుఫాన్ తాకిడితో విశాఖ హడలెత్తిపోయింది. నిమిషం విరామం కూడా లేకుండా మూడు రోజులుగా కురిసిన వర్షాలతో నగరం నిలువెల్లా తడిసి ముద్దయింది. దాంతో.. విశాఖ క్రీడాభిమానుల గుండెల్లో భయం ఇంతింతై మొదలై, పెను వాయు‘గండం’లా రూపాంతరం చెందింది.
రెండేళ్ల తర్వాత మళ్లీ జరగబోతున్న అంతర్జాతీయ మ్యాచ్ సాఫీగా సాగుతుందా? వర్షం కనికరిస్తుందా? మ్యాచ్ జరిగే రోజైనా వాన తెరిపిస్తుందా?.. శనివారం ఉదయం వరకు ఈ సవాలక్ష సందేహాలతో క్రికెట్ వీరాభిమానుల గుండె పీచుపీచుమంది.. ఓవంక సమైక్యాంధ్ర ఉద్యమకారుల హుంకారాలతో మొదటికే మోసమొస్తుందనుకుంటే.. ఆ అడ్డంకి దాటి మ్యాచ్ నిర్వహణకు అంతా అనుకూలిస్తే... వరుణుడు సైంధవుడిలా అడ్డు పడుతున్నాడన్న ఆందోళన అందరినీ బెంబేలెత్తించింది.
పూర్తిగా టార్పాలిన్లతో కప్పేసిన అవుట్‌ఫీల్డ్ ఫొటోలు చూసిన క్రికెట్ అభిమానుల మనసు ఉసూరంది.. కానీ... అందరి ప్రార్థన ఫలించింది! వైఎస్సార్ స్టేడియం సిబ్బంది, మ్యాచ్ నిర్వాహకుల నిర్విరామ కృషి సఫలమైంది! వానదేవుడి అనుగ్రహం కలిసొచ్చింది! విశాఖలో భారత, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం వన్డే మ్యాచ్ నిర్విఘ్నంగా, నిరాఘాటంగా జరిగింది! గెలిచింది వెస్టిండీస్ అయినా, అసలు విజయం క్రికెట్‌దే అయింది! లక్షలాది మంది క్రీడాభిమానుల ఆకాంక్షతో తుఫాన్ అవాంతరం దూదిపింజెల్లా చెల్లాచెదురైపోయింది!
భయం భయం
నవంబర్ అంటేనే తుఫాన్ల మాసం.. పైగా గత ఏడాది ఇదే సమయంలో జరగాల్సిన టీ20 మ్యాచ్ వర్షం వల్లే రద్దయిన చేదు అనుభవం.. ఈనెల 20 నాటికి వర్ష బీభత్సం చూసిన క్రీడాభిమానుల గుండెల్లో ఈ భయం లీలామాత్రంగా కదిలింది. దాన్ని బలపరిచే విధంగా, 21 నాడు.. 22 నాడు నిర్విరామంగా వాన కురిసింది. దాంతో 24 నాటి మ్యాచ్ జరగడం కష్టమేనన్న అభిప్రాయం వినవచ్చింది. అయితే 22 సాయంత్రం హెలెన్ తీరం దాటడమే కాకుండా, తర్వాత వరుణుడు కరుణించడంతో ఆశ చిగురించింది. శనివారమంతా ఎంత కాయడంతో ఇక మ్యాచ్ ఖాయమని నిశ్చయమైపోయింది. దాంతో విశాఖ క్రికెట్ అభిమాని ఆనందానికి అవధేలేకుండా పోయింది. అందుకు తగ్గట్టే, మ్యాచ్ వీసమెత్తు సమస్య లేకుండా అమోఘంగా సాగింది.
గ్రౌండ్ సిబ్బంది సామర్ధ్యమిది..
రెండు రోజులకు పైగా భారీ వర్షాలు వెంటాడిన పరిస్థితుల్లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణ అంటే దాదాపు అసాధ్యమే. అది అసాధారణ కృత్యమే. కానీ వైఎస్సార్ స్టేడియంలోని అద్వితీయ డ్రైనేజ్ వ్యవస్థ చుక్క నీటి జాడ కూడా లేకుండా చేసింది. అంతకు మించి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామ కృషి కారణంగా అసలు వర్షం కురిసిందా? అన్న తీరులో మైదానం తయారైంది. నిర్వాహకుల దీక్షతో మ్యాచ్ క్షణం జాప్యమైనా, అవాంతరమైనా లేకుండా సాగింది. స్టేడియం తీరు, సిబ్బంది తపన అంతర్జాతీయ వ్యాఖ్యాతల ప్రత్యేక ప్రశంసలకు పాత్రమైంది.
క్రికెట్ గెలిచింది!
Published Mon, Nov 25 2013 1:01 AM | Last Updated on Tue, May 29 2018 6:13 PM
Advertisement
Advertisement