వరుస తుపానులతో నష్టపోయిన రైతుల రుణాలు మాఫీ | Waive off farmers loans, demands Ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వరుస తుపానులతో నష్టపోయిన రైతుల రుణాలు మాఫీ

Published Wed, Nov 27 2013 1:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Waive off farmers loans, demands Ys Jagan mohan reddy

* ప్రభుత్వానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్
* మీరు చేయకుంటే మా ప్రభుత్వం రాగానే చేస్తాం
* తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
* తుపాన్లతో నష్టపోయిన రైతులను గాలికొదిలేశారంటూ ప్రభుత్వంపై ధ్వజం
* నష్టపోయిన రైతులకు వడ్డీ లేకుండా కొత్త రుణాలివ్వాలి
* ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి
* నీలం తుపాను బాధితులకు ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ ఎందుకివ్వలేదు?
* మేం అధికారంలోకి వచ్చాక రైతులకు మంచిరోజులు వస్తాయి

 
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇటీవల వరుస తుపానుల వల్ల నష్టపోయిన రైతుల రుణాలను మొత్తంగా మాఫీ చేసి, వడ్డీ లేకుండా కొత్త రుణాలు అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు పరిహారం అందించాలన్నారు.
 
 తుపానుతో నష్టపోయిన రైతుల రుణాలను రద్దు చేయకుంటే తాము అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామని ఉద్ఘాటించారు. ‘‘ఈ పాలకులకు మనసు లేదు.. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా రెండు తుపానులొచ్చాయి.. మరో తుపాను వస్తుందంటున్నారు.. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు.. మానవతా దృక్పథంతో వీరిని ఆదుకునే వారే కరువయ్యారు.. ఢిల్లీ రాజకీయాలపై చూపెడుతున్న శ్రద్ధ, రైతులపై చూపడం లేదు..’’ అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఏడాది నీలం తుపానులో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం జగన్ పర్యటించారు.
 
 నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కొత్తపేట మండలం వెలిశెట్టివారిపాలెం, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి, చెయ్యేరులలో రైతులతో మాట్లాడారు. ‘‘దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతును పట్టించుకోని రాష్ర్టం పరిస్థితి అధోగతే. వరుస విపత్తులతో రైతులు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మనసున్న మనుషులే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. ఇటీవలే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలిశా. జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లా. ప్రధానమంత్రికి కూడా నష్టంపై చెబుతాం. మీకు అండగా నేనుంటా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాడుతుంది’’ అని అన్నారు.
 
 వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని ఒక్క అధికారిగానీ, ఒక్క నాయకుడుగానీ పట్టించుకోలేదని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నీలం తుపాను వచ్చి ఏడాదైంది. ఇప్పటివరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేకపోయారు. పై-లీన్ తుపాను వచ్చింది. ఆ తర్వాత భారీ వర్షాలు ముంచేశాయి. బాధితులకు కేజీ బియ్యం కానీ, లీటరు కిరసనాయిల్ కానీ ఇవ్వలేదు. మళ్లీ హెలెన్ తుపాను విరుచుకుపడి ఐదు రోజులైంది.  ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి కానీ రైతులను పట్టించుకున్న పాపానపోలేదు’’ అంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

రైతు రుణాలను మాఫీ చేయాల్సిందే..:  తుపాను వల్ల నష్టపోయిన రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేసి, వడ్డీ లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘రైతులు ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేశారు. ఇప్పుడు పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. చేతికందే ధాన్యం మొలకొచ్చేసింది. వీరిని ఎవరు ఆదుకుంటారు? కేవలం నెల రోజుల్లో రెండు తుపాన్లు వచ్చాయి. మరో తుపాను ముంచుకొస్తుందంటున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు.
 
 తుపానుల వల్ల నష్టపోయిన రైతుల రుణాలను మొత్తంగా మాఫీ చేయాలి. కొత్త రుణాలు వడ్డీ లేకుండా అందించాలి. కోల్పోయిన పంటకు 75 శాతం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందించాలి. హుడా కమిషన్ ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను అస్సలు పట్టించుకోవడం లేదు’’ అని అన్నారు. తుపానుతో నష్టపోయిన రైతుల రుణాలు మాఫీ చేయకుంటే.. తాము అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామన్నారు. రాష్ట్రానికి ఎక్కువ పరిహారం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, రైతుల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు.
 
 బురదలో దిగి.. పంటను పరిశీలించి...
 పర్యటనలో అడుగడుగునా రైతులు తమ కష్టాలను జగన్‌కు చెప్పుకున్నారు. తమకు జరిగిన నష్టాన్ని చెబుతూ రైతులు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి జగన్ చలించిపోయారు. వెలిశెట్టివారిపాలెంలో కౌలు రైతు మట్ల పట్టాభిరామారావు మాట్లాడుతూ.. ‘‘వైఎస్ ఉండి ఉంటే మా బతుకులు ఇలా ఉండేవి కావు. ఆ మహానుభావుడు ఎప్పుడూ మా కోసమే ఆలోచించేవాడు’’ అని విలపించారు. పంటకు అప్పులు చేసి రూ. 80 వేల వరకు పెట్టుబడి పెట్టాన ని, ఇప్పుడు అంతా నాశనమైపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. జగన్ ఆ రైతును గుండెలకు హత్తుకొని ఓదార్చారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరుగున్నేపల్లిలో మోకాలి లోతు బురదలో దిగి.. దెబ్బతిన్న వరిపంటను జగన్ పరిశీలించారు.
 
 ఈ సందర్భంగా గాలిదేవర పేరయ్యనాయుడు అనే రైతు పురుగుల మందు డబ్బా చేత్తో పట్టుకుని ‘మాకు చావుతప్ప మరో గత్యంతరం లేదు’ అని వాపోయాడు. పంట కోసం ఇల్లు, వాకిలితోపాటు భార్య పుస్తెలు కూడా తాకట్టు పెట్టానని, ఇప్పుడు వర్షాలతో పంటంతా పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ ఆ రైతును ఓదారుస్తూ త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. చెయ్యేరులో ఉండ్రు నాగరాజు అనే వికలాంగుడు జగన్‌ను కలిశాడు. వైఎస్ ఉన్నప్పుడు తమకు పింఛను వచ్చేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నాడు.
 
 అందుకు జగన్ మాట్లాడుతూ.. ‘‘మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వికలాంగులకు రూ.వెయ్యి పింఛను ఇచ్చే ఫైలుపై మొదటి సంతకం చేస్తాను. వృద్ధులకు రూ.750 పింఛను ఇస్తాం’’ అని ధైర్యం చెప్పారు. ఎన్.చినపాలెం వద్ద లక్ష్మీనరసమ్మ అనే వృద్ధురాలు తుపానులో ఇల్లు కూలిపోయిందని, నిలువనీడ లేదంటూ జగన్ ముందు గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఆమెను ఆదుకోవాల్సిందిగా స్థానిక నాయకులకు జగన్ సూచించారు. అమలాపురం ఎర్రవంతెన వద్ద భట్నవిల్లి కొత్తచెర్వుకు చెందిన రాజ్‌కుమార్, ప్రశాంతి జగన్‌ను కలిసి.. తమ నాలుగేళ్ల కుమార్తె సాక్షికి పుట్టుకతోనే మాటలు రావడం లేదని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయలేమని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తంచేశారు.
 
 కోనసీమలో పలుచోట్ల పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం జగన్.. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన వైఎస్సార్ కాంగ్రెస్ కాట్రేనికోన మండల సేవాదళ్ కన్వీనర్ గిడ్డి దివాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కాట్రేనికోన సెంటర్‌లో మాట్లాడాలంటూ మత్స్యకారులు జగన్‌ను పట్టుబట్టారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. ‘‘నాలుగు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి రైతుకు, ప్రతి మత్స్యకారుడికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. బోట్లు కొట్టుకుపోయినా.. పంటలు నాశనమైనా.. వలలు పోయినా పట్టించుకునే నాథుడే లేడు’’ అని అన్నారు.
 
 జగన్ వెంట పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి  చిట్టబ్బాయి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, గంపల వెంకటరమణ, పార్టీ మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎంపీలు ఏజేవీబీ మహేశ్వరరావు, గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణ చౌదరి, పార్టీ సీఈసీ సభ్యురాలు వరుదు కల్యాణి తదితరులు ఉన్నారు.
 
 నేడు ‘పశ్చిమ’లో జగన్ పర్యటన
 ఏలూరు, న్యూస్‌లైన్: పశ్చిమగోదావరి జిల్లాలో హెలెన్ తుపానుతో నష్టపోయిన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పర్యటించనున్నారు. నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను పరామర్శిస్తారని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement