అమెరికా అధ్యక్షుడ్ని తేల్చేది..‘స్వింగ్’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లో ఎవరు విజయం సాధిస్తారన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 538 ఓట్లలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు స్వింగయ్యే రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలకుగాను ప్రస్తుతం 11 స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిని బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలని కూడా వ్యవహరిస్తారు.
ఇటు డెమోక్రట్లకు, అటు రిపెబ్లికన్లకు సమానమైన ఓట్ల శాతం కలిగిన రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలని పిలుస్తారు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క ఓటు అటు ఇటైనా ఫలితం మారిపోతుంది. స్వింగ్ రాష్ట్రాల సంఖ్య ఎప్పుడూ ఒకటే ఉండదు. మారుతూ ఉంటుంది. కానీ 2008 ఎన్నికల నాటి నుంచి ఈ స్వింగ్ రాష్ట్రాల సంఖ్య 11గానే ఉంది. 2008 ఎన్నికల్లో ఈ మొత్తం 11 స్వింగ్ రాష్ట్రాలు బరాక్ ఒబామాకే ఓటేశాయి. 2014 ఎన్నికల్లో 11కుగాను పది రాష్ట్రాలే ఆయనకు ఓటేశాయి. కొన్ని రాష్ట్రాలో ఆయనకు మెజారిటీ కూడా తగ్గింది.
స్వింగ్ రాష్ట్రాలు ఇవే...
కొలరాడో, ఫ్లోరిడా, ఐహోవా, మిచిగాన్, నేవడ, న్యూహాంప్‌షైర్, నార్త్ కరోలినా, ఓహాయో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్సిన్‌లు స్వింగ్ రాష్ట్రాలు. సాధారణంగా ఎన్నికల్లో విజేతను ఈ రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. మెజారిటీ రాష్ట్రాలు ఎవరి ఖాతాలో పడితే వారే విజయం సాధిస్తారు. ఒక అభ్యర్థికి ఐదు, ఒక అభ్యర్థికి ఆరు రాష్ట్రాలు ఓట్లు వస్తే అప్పుడు ఇతర రాష్ట్రాల ఫలితాలు సరళినే విజేతను నిర్ణయిస్తుంది. ఈ స్వింగ్ రాష్ల్రాల్లో మొదటి నుంచి మొన్నటి వరకు హిల్లరీ క్లింటన్ హవానే కొనసాగింది. అయితే ఆమె ఈమెయిళ్ల వ్యవహారంపై రెండోసారి ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభం కావడం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని, నాలుగు నుంచి ఎనిమిది రాష్ట్రాల వరకు ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని తాజా సర్వేలు తెలియజేస్తున్నాయి. కచ్చితంగా ఎనిమిది రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని ట్రంప్ కూటమి చెప్పుకుంటోంది.
ఇతర జాతీయుల ఓట్లు కీలకమే..
ఈ స్వింగ్ రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు శ్వేతజాతీయులే. వారిలో ఎక్కువ మంది ఈసారి ట్రంప్ వైపు మొగ్గు చూపిస్తున్నారని కూడా సర్వేలు చెబుతున్నాయి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా శ్వేత జాతీయుల ఓటర్ల సంఖ్య ఈ రాష్ట్రాల్లో తగ్గుతూ వస్తోంది. నల్ల జాతీయులు ఎప్పుడూ డెమోక్రట్లకే ఓటు వేస్తారు. ఈసారి వారికి అధికార ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నందున ట్రంప్‌కు వేస్తారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో శ్వేత జాతీయులే కాకుండా మిగతా జాతీయులు ఎవరికి వేస్తారన్నది కూడా ముఖ్యమేనని ఎన్నికలు పరిశీలకులు చెబుతున్నారు. కొలరాడాలో 22 శాతం ఇతర జాతీయులు, ఫ్లోరిడాలో 33 శాతం, నేవడలో 36 శాతం, కరోలినాలో 30 శాతం, వర్జీనియాలో 30 శాతం ఇతర జాతీయులు ఉన్నారు. ఎవరి వైపు ‘స్వింగ్’ ఉందో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నందున హిల్లరీ, ట్రంప్ మధ్య పోటీ పోటీగా సమరం సాగుతుందని పరిశీలకులు అంటున్నారు.
నవంబర్ 8వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నప్పటీకీ అమెరికా రాజ్యాంగం కల్పిస్తున్న వెసులుబాటు ప్రకారం రెండు వారాల క్రితం ప్రజలు ఓట్లు వేయడం ప్రారంభమైంది. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు మూడున్నర కోట్ల మంది ప్రజలు ఓటు వేశారు.