
ట్రంప్‌పై ఒక శాతం ఆధిక్యం
కీలకాంశాల్లో మాత్రం ట్రంప్‌కే జై
రాయిటర్స్ తాజా పోల్ వెల్లడి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మరోసారి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆమెకు ఒక శాతం మొగ్గున్నట్టు మంగళవారం వెలువడ్డ రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో తేలింది. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జరిపిన ఈ మూడు రోజులు హారిస్‌కు 44 శాతం, ట్రంప్‌కు 43 శాతం మంది మద్దతిచ్చారు. 975 మంది నమోదైన ఓటర్లతో కలిపి మొత్తం 1,150 మంది అమెరికా పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
అయితే ఎకానమీ, నిరుద్యోగం, ఉపాధి వంటి అతి కీలకమైన అంశాల్లో ఏకంగా 47 శాతం మంది ట్రంప్‌కే ఓటేశారు. హారిస్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 37 శాతం మాత్రమే. మరో కీలకాంశమైన వలసల విషయంలో కూడా ట్రంప్ 48 శాతం మంది వైఖరిని సమర్థిస్తే హారిస్‌ను 33 శాతం మందే సమర్థించారు. కచ్చితంగా ఓటేస్తామన్న వారిలో 47 శాతం హారిస్‌ను, 46 శాతం ట్రంప్‌ను బలపరిచారు. హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి సర్వేలన్నీ ఆమెకే మొగ్గున్నట్టు తేల్చడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment