మహిమ(పేరు మార్చాం).. సాఫ్ట్‌వేర్ డెవలపర్. తాత్కాలిక వీసా మీద అమెరికాలో ఉండేవారు. భర్త, ఇద్దరు కూతుళ్ల(వీరికి అమెరికా పౌరసత్వం ఉంది)తో కలిసి కాలిఫోర్నియాలో నివసించేవారు. ఈ క్రమంలో మార్చి తొలి వారంలో తన తల్లి అనారోగ్యం పాలయ్యారనే విషయం తెలిసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత భారత్‌కు పయనమయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమె భర్త, కూతుళ్లు అక్కడే ఉండిపోయారు. ఇదిలా ఉండగా.. తల్లి మరణించిన ఎనిమిది రోజుల తర్వాత మహిమ.. తిరిగి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వీసా స్టాంపింగ్‌కై మార్చి 16న ముంబైలోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లగా.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కార్యాలయం మూసి ఉండటం గమనించారు. అనంతరం లాక్‌డౌన్ పరిణామాల నేపథ్యంలో ఇక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం... ముంబై శివార్లలోని బంధువుల ఇంట్లో ఆమె ఆశ్రయం పొందుతున్నారు.
ఇక అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిమ 2020, డిసెంబరు వరకు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం గురించి ఆమె రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే నేను నా తల్లిని కోల్పోయాను. ఇక ఇప్పుడు మాతృత్వానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు నా మనసంతా దిగులుతో నిండిపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పిల్లలకు దూరంగా ఉంటే అది వాళ్ల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా ట్రంప్ తాజా నిర్ణయంతో మహిమ ఒక్కరే కాదు ఆమెలాంటి ఎంతో మంది ఎన్నారైలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా, ఇతర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన వారు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఈ విషయం గురించి వినోద్ అల్బూకర్క్ అనే బిజినెస్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. ‘‘నేను అట్లాంటాలో పనిచేస్తున్నా. ఫిబ్రవరిలో నా తండ్రికి గుండెపోటు రావడంతో.. గర్భవతి అయిన భార్య, ఆరేళ్ల కుమారుడిని అక్కడే వదిలి హుటాహుటిన మంగళూరుకు వచ్చాను. అమెరికాలో ఇలాంటి హెచ్1 బీ వీసా విధానం వస్తుందని ఊహించలేదు. నేను నేటికీ అమెరికాలో పన్నులు చెల్లిస్తూనే ఉన్నాను. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల భార్యా, పిల్లలకు దూరం కావాల్సి రావడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు.(హెచ్ 1బీ ఆపేశారు.. అమెరికన్ల హర్షం)
కాగా గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేసిన ట్రంప్.. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. ఇక ఈ ఉత్తర్వులు జూన్ 24 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అత్యవసరాలైన ఆహారం, వైద్య రంగాలతోపాటు కరోనా పరిశోధనల్లో పని చేసే వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌజ్ ప్రకటన అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలకు మేలు చేకూర్చే విధంగా ఉండగా.. అమెరికా పౌరులైన పిల్లల తల్లిదండ్రులకు ఇది ఏవిధంగా ప్రయోజనం కలిగించనుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు... అమెరికాలో ఇప్పటికే వివిధ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment