అమెరికాలో హెచ్ 1 బీ టెన్షన్... | More Than 2 Lakh H 1B Workers May Lose Legal Status by June | Sakshi
Sakshi News home page

హెచ్‌-1 బీ: జూన్ నాటికి ముగుస్తున్న గడువు!

Published Wed, Apr 29 2020 12:02 PM | Last Updated on Wed, Apr 29 2020 7:11 PM

More Than 2 Lakh H 1B Workers May Lose Legal Status by June - Sakshi

‘‘ప్రస్తుతం పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఒత్తిడి కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి’’అంటూ మహిమ(పేరు మార్చాం) ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌-1 బీ వీసా మీద న్యూజెర్సీలోని పేసియాక్‌ కౌంటీలో దంత వైద్యురాలిగా ప్రాక్టీసు చేస్తున్నారామె. గత రెండేళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో మార్చి మూడో వారం నుంచి క్లినిక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పటి నుంచి జీతంలేని సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు మహిమ. ఈ క్రమంలో చట్టబద్ధంగా అమెరికాలో నివసించడానికి ఆమెకు ఇంకా మూడు వారాల కంటే తక్కువ గడువు మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే స్థానిక చట్టాల ప్రకారం హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న వారు ఉద్యోగం కోల్పోతే రెండు నెలల్లో(60 రోజులు) కొత్త ఉద్యోగం పొందాలి. లేదంటే వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశం కాదు కదా ఇంటి నుంచి కూడా అడుగుతీసి బయటపెట్టలేని పరిస్థితి. ఇక మహిమతో పాటు ఆమె భర్త కూడా అమెరికాలోనే డెంటిస్ట్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. ఆయన హెచ్‌1-బీ వీసా గడువు జూన్‌తో ముగియనుంది. అంతేకాదు ఉన్నత విద్యనభ్యసించడం కోసం ఇద్దరూ కలిసి తీసుకున్న స్టూడెంట్‌ లోన్‌ దాదాపు 5,20,000 డాలర్ల మేర బకాయి ఉంది. ప్రస్తుతం వీసా గడువు ముగియనుండటం, ఉద్యోగం కోల్పోయే పరిస్థితి తలెత్తడంతో ఆ దంపతులు రోజంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మహిమ దంపతులే కాదు వారిలా హెచ్‌-1బీ వీసాపై నివసించే ఎంతో మంది పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది.(హెచ్‌1బీ రిజిస్ట్రేషన్లలో మనవాళ్లే టాప్‌)

కాగా వలసలన్నిటిపైనా రెండు నెలలపాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వ్యాపార సంస్థలన్నీ మండిపడటంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో రెండు నెలలపాటు కొత్తగా వీసాలు లేదా గ్రీన్‌ కార్డులు జారీ చేసే ప్రక్రియ మాత్రమే నిలిపివేసేలా ట్రంప్‌ సర్కారు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమెరికాలో వున్నవారికి ఈ నిషేధ ఉత్తర్వులు వర్తించవు అనే నిబంధన కాస్త ఊరట కలిగించేదిగా కనిపిస్తున్నా... ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు మాత్రం ఉద్యోగ భద్రత లేకపోవడం కలవరపెడుతోంది. 

జూన్ చివరి నాటికి దేశాన్ని వీడాల్సిందేనా
‌అగ్రరాజ్యంలో గెస్ట్‌ వర్కర్‌ వీసా కింద పనిచేస్తున్న వారిలో దాదాపు 2,50,000 మంది గ్రీన్‌ కార్డు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్‌-1బీ వీసా గడువు జూన్‌ చివరి నాటికి ముగియనుందని ఇమ్మిగ్రేషన్‌ పాలసీ అనలిస్ట్‌ జెరేమీ న్యూఫెల్డ్‌ బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. పెద్ద సంఖ్యలో హెచ్‌-1బీ వీసాదారులు స్వదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి చెందిన తాత్కాలిక వీసాదారులపైనే భారం పడనుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా గత రెండు నెలల్లో అమెరికాలో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక హెచ్‌-1బీ వీసాదారుల్లో కొంతమంది ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు భద్రంగానే ఉన్నా.. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మరో నిపుణుడు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోతే తిరిగి సంపాదించడం, వీసాను పునరుద్ధరించుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు.(చైనాపై లోతైన దర్యాప్తు: ట్రంప్‌)

మనిషి జీవన విధానం, ఆర్థిక వ్యవస్థకు సంభవించిన అతిపెద్ద విపత్తు
 ఇక ఒబామా పాలనా కాలంలో ఇమ్మిగ్రేషన్‌ పాలసీ అధికారిగా పనిచేసిన డోగ్‌ ర్యాండ్‌ మాట్లాడుతూ.. వీసా సంక్షోభం.. ‘‘మనిషి జీవన విధానం, ఆర్థిక వ్యవస్థకు సంభవించిన అతిపెద్ద విపత్తు’’ అని పేర్కొన్నారు. హెచ్‌-1బీ వీసా దారులు ఉద్యోగులు ఉపాధి కోల్పోతే వారిపైనే ఆధారపడి ఇక్కడ బతుకుతున్న కుటుంబాలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఆపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌​, మైక్రోసాఫ్ట్‌ తదితర దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న టెక్‌నెట్‌ అనే లాబీయింగ్‌ గ్రూప్‌ ఏప్రిల్‌ 17న హోంల్యాండ్‌‌ సెక్యూరిటీ విభాగానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. విదేశాల్లో పుట్టిపెరిగి.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నిపుణులకు ప్రస్తుతం పరిస్థితుల్లో వీసా గడువు సెప్టెంబరు 10 వరకు పొడిగించాలని లేఖలో కోరింది. తమ అభ్యర్థనను మన్నించనట్లయితే అది ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

అయితే ఈ లేఖపై ట్రంప్‌ పాలనా యంత్రాంగం నేరుగా స్పందించలేదు. ఈ మేరకు  వీసా గడువు పొడిగించే అవకాశాల గురించి ప్రస్తావించకుండా.. అమెరికా సిటిజన్‌షిఫ్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తప్పక అండగా నిలబడతామని పేర్కొన్నారు. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికాలో ఉన్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని భారత ప్రభుత్వం కోరిగా.. తాము ఈ విషయం గురించి ఆలోచిస్తున్నామని (యుఎస్‌సిఐఎస్) పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్‌-19 కారణంగా వీసా పునరుద్ధరణకు అప్లై చేయనివాళ్లకు అవకాశం కల్పిస్తామని తెలిపింది.

ఆ తర్వాతే తదుపరి నిర్ణయం
ఇదిలా ఉండగా... వలసలపై ట్రంప్‌నకున్న వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్సాలిన పనిలేదు. అమెరికాలోని ఉపాధి అవకాశాలన్నిటినీ వలసదారులు దక్కించుకోవడం వల్లే స్థానికులకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆయన మొదటినుంచీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఈ ఎజెండాతోనే అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటం, కరోనా సంక్షోభాన్ని రూపుమాపడంలో ట్రంప్‌ సర్కారు విఫలమైందన ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో తాను పాత వాగ్దానానికి కట్టుబడి ఉన్నానన్న విషయాన్ని రుజువుచేసుకునేందుకు ఏప్రిల్‌ 20న మరోసారి వలసల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. అంతేకాదు ఈ తాత్కాలిక నిషేధం గడువు ముగిశాక దాన్ని పొడిగించాలో లేదో నిర్ణయిస్తామని కూడా చెప్పి బాంబు పేల్చారు. దీంతో కరోనా మహమ్మారి కట్టడి మాటున సొంత ఎజెండాను అమలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనా?
ఈ నేపథ్యంలో విదేశీ ఉద్యోగుల నైపుణ్యంతో అధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్‌కార్డు బ్యాన్‌ వంటి అంశాలు ఉద్యోగుల మానసిక స్థితిని గందరగోళంలోకి నెట్టేస్తాయని.. ఇది అవుట్‌పుట్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నాయి. అంతేగాక కంపెనీలు, ఉద్యోగులు ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని.. దీంతో మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో స్థిరపడాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చిన తమకు నిరాశే ఎదురైందని షాన్‌ నారోన్హా అనే 23 ఏళ్ల ఆస్ట్రేలియన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో తన వర్క్‌ వీసాను టూరిస్ట్‌ వీసాగా మార్చుకున్నానని.. పేచెక్స్‌ లేకపోవడంతో సేవింగ్స్‌ మొత్తం ఖర్చయిపోతున్నాయని పేర్కొన్నాడు. ఇమ్మిగ్రేషన్‌ విధానంపై పునరాలోచన చేయాలని ట్రంప్‌ను ట్విటర్‌ వేదికగా అభ్యర్థించానని.. ఒకవేళ పరిస్థితలు ఇలాగే ఉంటే స్వదేశానికి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. (కర్టెసీ: బ్లూమ్‌బర్గ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement