UK visa rules
-
యూకే స్టూడెంట్ వీసా.. మరింత భారం!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఉన్నత చదువులకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ చేదువార్త చెప్పింది. స్టూడెంట్ వీసా కావాలంటే మునుపటి కన్నా ఎక్కువ సొమ్ములు చూపించాలని అంటోంది.ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు ఇక నుంచి అధిక నిధులు సమకూర్చుకోవాల్చిందే. యూకే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సిన మొత్తాన్ని బ్రిటన్ 11.17 శాతం పెంచేసింది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక నుంచి విద్యార్థి వీసా దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.14.4 లక్షలు (13,347 పౌండ్లు) మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సి ఉంటుంది. 28 రోజుల పాటు వారి బ్యాంక్ ఖాతాలో ఈ నగదు ఉండాలి. ఇప్పటివరకు ఈ మొత్తం రూ. 12.9 లక్షలు (12,006 పౌండ్లు)గా ఉంది. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘మెయింటెనెన్స్ మనీ’ కూడా పెంచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.లండన్‌లో వెలుపల చదవాలనుకున్న విద్యార్థులకు కూడా మెయింటెనెన్స్ మనీ 11.05 శాతం వరకు పెరిగింది. లండన్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు విదేశీ విద్యార్థులు ఇప్పటివరకు 9,207 పౌండ్లు మెయింటెనెన్స్ మనీగా చూపించేవారు. ఇక నుంచి ఈ మొత్తం 10,224 పౌండ్లకు పెరుగుతుంది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పేర్కొంది.యూకే స్టూడెంట్ వీసాల నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులు మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను మరింత సూక్ష్మంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నిర్వహణ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందాలంటే స్కాలర్షిప్లు సంపాదించాలని సలహాయిస్తున్నారు. విదేశాల్లో చదువు పూర్తైన తర్వాత బాగా సెటిలయితే తాము పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయినట్టేనని కెరీర్ మొజాయిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు.చదవండి: హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!విదేశాల్లో ఉన్నత చదువు కోసం స్టూడెంట్ వీసా పొందేందుకు కొంత మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలో చూపించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, నిర్వహణ ఖర్చుల కోసం తగినంత డబ్బును వారి బ్యాంక్ ఖాతాలో చూపించాలి. లండన్‌లో చదవాలకునే విదేశీ విద్యార్థులు 20 వేల పౌండ్లు ‘మెయింటెనెన్స్ మనీ’ అవసరమవుతుంది. ఒకవేళ వీసా అప్లై చేయడానికి ముందే 5 వేల పౌండ్లు చెల్లిస్తే.. మిగతా 15 వేల పౌండ్లు బ్యాంకు ఖాతాలో 28 రోజుల పాటు ఉండాలి. -
చలో యూకే.. పోస్ట్ స్టడీ వర్క్ ఇక.. ఓకే!
యూకేలో ఉన్నత విద్య.. మన దేశ విద్యార్థులకు.. టాప్–4 డెస్టినేషన్! అకడమిక్‌గా పలు వెసులుబాట్లు ఉండటంతో.. మన విద్యార్థులు యూకే వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా యూకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త విధానంతో.. బ్యాచిలర్ నుంచి పీహెచ్డీ వరకు..ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ఉద్యోగం దొరికితే.. ఆ దేశంలోనే స్థిరపడొచ్చు. ఇంతకీ.. ఆ కొత్త విధానం ఏంటి? అంటే.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా!! ఈ విధానం ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానంతో.. భారత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఈ నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధి విధానాలు.. భారత విద్యార్థులకు ప్రయోజనాలు.. పోస్ట్ స్టడీ వర్క్ గరిష్ట సమయం తదితర అంశాలపై విశ్లేషణ... అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం ఇటీవల గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్డీ విద్యార్థులు మూడేళ్లుపాటు పోస్ట్ స్టడీ వర్క్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా మంజూరైతే.. ఆఫర్ లెటర్ లేకపోయినా.. అక్కడే ఉండి ఉద్యోగానేష్వణ చేయొచ్చు. ఉద్యోగం లభిస్తే గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి ముగిశాక.. ఇతర వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు గ్రాడ్యుయేట్ వీసాతో ఉద్యోగం పొంది.. రెండేళ్లు, లేదా మూడేళ్ల వ్యవధి పూర్తయ్యాక.. స్కిల్డ్ వర్కర్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరైతే.. సదరు అభ్యర్థులు మరింత కాలం యూకేలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. గ్రాడ్యుయేట్ వీసాకు అర్హతలు ► జూలై 1, 2021 నుంచి గ్రాడ్యుయేట్ రూట్ వీసా అమల్లోకి వచ్చింది. ► ఈ వీసా పొందేందుకు యూకే ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలు పేర్కొంది. ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే నాటికి యూకేలో ఉండాలి. ► ప్రస్తుతం స్టూడెంట్ వీసా లేదా చదువుల కోసం ఇచ్చే టైర్–4 జనరల్ వీసా కలిగుండాలి. ► యూకే విద్యా విధానం నిబంధనల ప్రకారం–నిర్దేశించిన కనీస కాలపరిమితితో ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ► కనీసం 12 నెలల వ్యవధిలోని కోర్సులను స్టూడెంట్ వీసా లేదా, టైర్–4 జనరల్ వీసా ద్వారా చదివుండాలి. స్టూడెంట్ వీసా ముగిసే లోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకొని.. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం పొందాలనుకునే విద్యార్థులు.. తమ స్టూడెంట్ వీసా లేదా టైర్–4 జనరల్ వీసా కాలపరిమితి ముగిసేలోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిబంధన కల్పిస్తున్న మరో ముఖ్యమైన వెసులుబాటు.. విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్లు పొందకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా పొందేందుకు వీలుగా తాము కోర్సులు పూర్తిచేసుకున్న యూకే ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ‘ఆన్లైన్’ విద్యార్థులకూ.. అవకాశం కరోనా కారణంగా యూకే యూనివర్సిటీల్లో ఆన్లైన్ విధానంలో కోర్సులు చదివిన విద్యార్థులు కూడా గ్రాడ్యుయేట్ వీసా విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా పరిస్థితుల్లో 2020 నుంచి లాక్డౌన్, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాంతో విద్యా సంస్థలు ఆన్లైన్లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించి... బోధన సాగించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ వెసులుబాటు కల్పించారు. ఫలితంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో స్టూడెంట్ వీసా లేదా టైర్–4 వీసా కలిగి.. జనవరి 24, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2021లోపు యూకే ఇన్స్టిట్యూట్లలో యూకే వెలుపలే ఉంటూ.. ఆన్లైన్ విధానంలో కోర్సులు అభ్యసించిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లో పూర్తి చేయాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ► పాస్ట్ పోర్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, స్కాలర్షిప్ లేదా స్పాన్సర్షిప్ ప్రొవైడర్ నుంచి ధ్రువీకరణ పత్రం, కోర్సు ప్రవేశ సమయంలో ఇచ్చే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్(సీఏఎస్) రిఫరెన్స్ నెంబర్, బయో మెట్రికల్ రెసిడెన్స్ పర్మిట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ► పీహెచ్డీ విద్యార్థుల విషయంలో అకడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికెట్ కూడా అవసరం. ఎనిమిది వారాల్లో నిర్ణయం ఆన్లైన్లో గ్రాడ్యుయేట్ వీసా దరఖాస్తును పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకునేందుకు గరిష్టంగా ఎనిమిది వారాల సమయం పడుతుందని యూకే ఇమిగ్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తుకు ఆమోదం లభిస్తే ఈ–మెయిల్ లేదా యూకే ఇమిగ్రేషన్ పోర్టల్‌లో దానికి సంబంధించిన ధ్రువీకరణను తెలుసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసాతో ప్రయోజనాలు ► కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం లభిస్తుంది. ► ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. ► స్వయం ఉపాధి పొందొచ్చు. స్వచ్ఛంద సేవకు అవకాశం ఉంటుంది. ► గ్రాడ్యుయేట్ వీసా కాల పరిమితి సమయంలో యూకే నుంచి స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లి, మళ్లీ యూకేకు తిరిగిరావచ్చు. నిపుణుల కొరతే కారణం ► యూకేలో పలు రంగాల్లో నిపుణులైన మానవ వనరుల కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం తాజాగా గ్రాడ్యుయేట్ రూట్ వీసాను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ► ప్రస్తుతం యూకేలో హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో నిపుణుల కొరత కనిపిస్తోంది. ► 2030 నాటికి ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం కూడా తాజా గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం తేవడానికి మరో కారణంగా చెబుతున్నారు. భారత విద్యార్థులకు ప్రయోజనం గ్రాడ్యుయేట్ రూట్ వీసాతో భారత విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గత నాలుగైదేళ్లుగా యూకేకు వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తాజా విధానంతో వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. ఈ వీసా కాల పరిమితి సమయంలో అక్కడే ఉండి ఉద్యోగం సాధించి.. అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ కూడా పొందొచ్చు. యూకేలో విద్యార్థులు యూకేలో విద్య కోసం గత నాలుగేళ్లుగా భారత్ నుంచి వెళుతున్న విద్యార్థుల సంఖ్య వివరాలు.. » 2016 – 11,328 » 2017 – 14,435 » 2018 – 19,505 » 2019 – 34,540 » 2020 – 49,884 గ్రాడ్యుయేట్ రూట్ వీసా.. ముఖ్యాంశాలు ► జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం. ► బ్యాచిలర్, పీజీ విద్యార్థులు రెండేళ్లు; పీహెచ్డీ అభ్యర్థులు మూడేళ్లు అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ► 2020, 2021లో యూకేలోని వర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం. ► కోవిడ్ నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ విధానంలో అభ్యసించిన వారు కూడా అర్హులే. ► ఉద్యోగం సొంతం చేసుకున్నాక.. వర్క్ వీసాకు బదిలీ చేసుకునే వీలుంటుంది. ► కోర్సుల సర్టిఫికెట్లు రాకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. ఎంతో సానుకూల అంశం యూకే తాజా నిర్ణయం.. భారత విద్యార్థులకు ఎంతో సానుకూల అంశంగా చెప్పొచ్చు. యూకేలోని విదేశీ విద్యార్థుల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంటోంది. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. గ్రాడ్యుయేట్ వీసా ద్వారా భారత విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయోజనం పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం విదేశీయులకు ఇచ్చే వీసాల విషయంలోనూ.. దాదాపు యాభై శాతం వీసాలు మన దేశానికి చెందిన వారికే లభిస్తున్నాయి. – జె.పుష్పనాథన్, డైరెక్టర్ (సౌత్ ఇండియా), బ్రిటిష్ కౌన్సిల్ -
ఆంగ్ల భాష.. ఆమె పాలిట శాపం
సాక్షి, న్యూఢిల్లీ : అర్హత ఎక్కువగా ఉన్నా ఇబ్బందేనని ఇక్కడో యువతి ఉదంతం నిరూపిస్తోంది. ఇంగ్లీష్ భాషపై పట్టు ఎక్కువగా ఉండటంతో బ్రిటన్ అధికారులు ఆమెకు వీసా నిరాకరించారు. పైగా అందుకు వారు ఇచ్చిన వివరణ మరీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్‌కు చెందిన చెందిన మహిళే ఇక్కడ బాధితురాలు కావటం విశేషం. వివరాల్లోకి వెళ్లితే... మేఘాలయా.. షిల్లాంగ్‌కు చెందిన అలెగ్జాండ్రియా రిన్టౌల్ ఐఈఎల్‌టీస్ ఉత్తీర్ణత సాధించింది. యూకే వెళ్లేందుకు ఆమె వీసా కోసం దరఖాస్తు చేసుకోగా.. అందుకు ఓ చిన్న నిబంధన అడ్డు వచ్చింది. యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన కేంద్రాల్లో సదరు అభ్యర్థులు ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె పరీక్షకు హాజరుకావటంతోపాటు తన ఐఈఎల్టీఎస్ సర్టిఫికెట్‌ను వారికి పంపారు. కానీ, ఆమె వీసా తిరస్కరణకు గురైంది. దిగ్భ్రాంతికి గురైన ఆమె అధికారులను వివరణ కోరగా.. వారు విస్మయం కలిగించే వివరాలను వెల్లడించారు. ఆమె కావాల్సిన దానికంటే అధిక అర్హత కలిగి ఉన్నారని చెబుతూ... సమర్పించిన పత్రాలపై అనుమానం ఉన్నట్లు వారు తెలిపారు. పైగా ఆమె జాతీయతకు భంగం కలిగించేలా I am NOT SATISFIED your nationality is that of a MAJORITY English speaking country సదరు అధికారి ఓ లైన్ ను ఉంచారు. ఆంగ్ల భాష తక్కువగా మాట్లాడే దేశంలో అంత అనర్గళంగా ఆమె మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందని.. పైగా యూకేవీకి ఆమె పంపిన సర్టిఫికెట్ చెల్లదని బదులు పంపింది. పీవీఎస్(ప్రయారిటీ వీసా సర్వీస్)కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రింటౌల్ తన ఫేస్బుక్లో ఓ సందేశాన్ని ఉంచారు. అన్ని అర్హతలు ఉన్నా వీసా తిరస్కరణకు గురికావటం బాధించిందని.. గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా ఆమె పడుతున్న కష్టాలు అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదో తెలీట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కాట్ లాండ్ కు చెందిన బాబీ రింటౌల్ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాదు యూకేలో వారు ఓ ఇల్లును కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్లో ఉంటున్న ఆమె పెరిగిపోతున్న ఖర్చులు చూసి కంగారుపడిపోతున్నారు. దయచేసి ఎవరైనా జోక్యం చేసుకోవాలంటూ ఆమె అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు షాకిచ్చిన యూకే!
-
మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు షాకిచ్చిన యూకే!
యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణుల వీసా విషయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. దాంతో ముఖ్యంగా భారతదేశం నుంచి అక్కడకు వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై పెను ప్రభావం పడబోతోంది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ (ఐసీటీ) విభాగంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లకు వేతనం దాదాపు రూ. 25 లక్షలు ఉండాలని చెప్పింది. ఇది ఇంతకుముందు రూ. 17.30 లక్షలుగా ఉండేది. ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్.. అంటే కంపెనీ తరఫున విదేశాల్లో పనిచేయడానికి వెళ్లేవారు. ఈ మార్గాన్ని భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఈ మార్గంలో వచ్చేవాళ్లలో దాదాపు 90 శాతం మంది భారతీయ ఐటీ కంపెనీల ఉద్యోగులే ఉంటున్నట్లు యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (మ్యాక్) గుర్తించింది. మూడు రోజుల పర్యటన కోసం బ్రిటిష్ ప్రధాని థెరెసా మే భారతదేశానికి రావడానికి సరిగ్గా మూడు రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమిస్తుందని చెబుతున్నారు. వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు భారతీయులు యూకే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరచాలని అనుకోవడం లేదని.. భారతదేశంలో నిపుణులైన ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని మ్యాక్ నివేదిక తెలిపింది. పలు బహుళ జాతీయ కంపెనీలు భారతదేశంలో ఉన్నాయని.. యూకేలో ఉన్న వాటి శాఖల కంటే భారతదేశంలో ఉన్న శాఖల ద్వారా ఐటీ సేవలు అందించడంలో వాటికి పోటీలో సానుకూలత ఎక్కువగా ఉందని పేర్కొంది. వాళ్లు ఒక డెలివరీ మోడల్‌ను అభివృద్ధి చేసుకున్నారని, దాని ద్వారా భారతదేశంలోనే పనిచేస్తూ ప్రాజెక్టులు డెలివరీ చేస్తున్నారని తెలిపింది. ఒకే స్థాయి ఉద్యోగులు యూకేలో ఉన్నప్పటి కంటే భారతదేశంలో ఉంటే వాళ్ల జీతాలు తక్కువ కావడమే అందుకు కారణమని వివరించింది. భారతీయ ఐటీ కంపెనీలలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వగల సామర్థ్యం బాగుందని, వాళ్లు తమ సొంత దేశం వారి నైపుణ్యాలను బాగా పెంచుతున్నారని కూడా పేర్కొంది. ఇదంతా చూస్తుంటే.. ఇంగ్లిష్ వారి కంటే భారతీయ ఐటీ నిపుణులకు సామర్థ్యం ఎక్కువని, ఇక్కడ శిక్షణ సదుపాయాలు బాగుండటం, జీతాలు కూడా తక్కువగా ఉండటంతో భారత్ నుంచి పనిచేస్తే వాళ్లకు ఖర్చులు తక్కువవుతున్నాయని.. అందువల్ల కంపెనీ మీద ఆర్థిక భారం తగ్గి లాభాలు ఎక్కువవుతున్నాయని ఇంగ్లండ్ భావిస్తున్నట్లుంది.