సాక్షి, న్యూఢిల్లీ : అర్హత ఎక్కువగా ఉన్నా ఇబ్బందేనని ఇక్కడో యువతి ఉదంతం నిరూపిస్తోంది. ఇంగ్లీష్ భాషపై పట్టు ఎక్కువగా ఉండటంతో బ్రిటన్ అధికారులు ఆమెకు వీసా నిరాకరించారు. పైగా అందుకు వారు ఇచ్చిన వివరణ మరీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్‌కు చెందిన చెందిన మహిళే ఇక్కడ బాధితురాలు కావటం విశేషం.
వివరాల్లోకి వెళ్లితే... మేఘాలయా.. షిల్లాంగ్‌కు చెందిన అలెగ్జాండ్రియా రిన్‌టౌల్ ఐఈఎల్‌టీస్ ఉత్తీర్ణత సాధించింది. యూకే వెళ్లేందుకు ఆమె వీసా కోసం దరఖాస్తు చేసుకోగా.. అందుకు ఓ చిన్న నిబంధన అడ్డు వచ్చింది. యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన కేంద్రాల్లో సదరు అభ్యర్థులు ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె పరీక్షకు హాజరుకావటంతోపాటు తన ఐఈఎల్‌టీఎస్ సర్టిఫికెట్‌ను వారికి పంపారు. కానీ, ఆమె వీసా తిరస్కరణకు గురైంది.
దిగ్భ్రాంతికి గురైన ఆమె అధికారులను వివరణ కోరగా.. వారు విస్మయం కలిగించే వివరాలను వెల్లడించారు. ఆమె కావాల్సిన దానికంటే అధిక అర్హత కలిగి ఉన్నారని చెబుతూ... సమర్పించిన పత్రాలపై అనుమానం ఉన్నట్లు వారు తెలిపారు. పైగా ఆమె జాతీయతకు భంగం కలిగించేలా I am NOT SATISFIED your nationality is that of a MAJORITY English speaking country సదరు అధికారి ఓ లైన్ ను ఉంచారు. ఆంగ్ల భాష తక్కువగా మాట్లాడే దేశంలో అంత అనర్గళంగా ఆమె మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందని.. పైగా యూకేవీకి ఆమె పంపిన సర్టిఫికెట్ చెల్లదని బదులు పంపింది. పీవీఎస్(ప్రయారిటీ వీసా సర్వీస్)కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రింటౌల్ తన ఫేస్‌బుక్‌లో ఓ సందేశాన్ని ఉంచారు.
అన్ని అర్హతలు ఉన్నా వీసా తిరస్కరణకు గురికావటం బాధించిందని.. గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా ఆమె పడుతున్న కష్టాలు అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదో తెలీట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కాట్ లాండ్ కు చెందిన బాబీ రింటౌల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాదు యూకేలో వారు ఓ ఇల్లును కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్‌లో ఉంటున్న ఆమె పెరిగిపోతున్న ఖర్చులు చూసి కంగారుపడిపోతున్నారు. దయచేసి ఎవరైనా జోక్యం చేసుకోవాలంటూ ఆమె అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment