
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో కనీసం 75 శాతానికి సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది.
మే 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి, భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ. 16,29,964) తమ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ చూపించాలి.
నాలుగు సార్లు పెంపు
ఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి వీసా నిబంధనలను నాలుగు సార్లు సవరించింది. గత సంవత్సరం అక్టోబర్ నాటికి, విద్యార్థి వీసాల కోసం చూపించాల్సిన మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండేది.
ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment