
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి, సందర్శక వీసా ఫీజులను త్వరలో భారీగా పెంచనుంది. విజిటింగ్ వీసాపై 15 పౌండ్లు, విద్యార్థి వీసాపై అదనంగా 127 పౌండ్లు పెంచుతున్నట్లు తెలిపింది. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి ఇవి వర్తిస్తాయని పేర్కొంది. ఈ పెంపుదల అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్‌లో హోంశాఖ ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టింది.
దీని బిల్లు ప్రకారం ఆరు నెలల విజిటింగ్ వీసా ఫీజు ప్రస్తుతమున్న 100 పౌండ్ల నుంచి 115 పౌండ్ల(సుమారు రూ.12 వేలు)కు, విద్యార్థి వీసాకు ఫీజు 363 పౌండ్ల నుంచి 490 పౌండ్ల(సుమారు రూ.50 వేలు)కు పెరగనుంది. ఫీజుల పెంపు ఆరోగ్యం, సంరక్షణ వీసాతో సహా దాదాపు అన్ని రకాల వీసాలకు వర్తిస్తుంది; బ్రిటిష్ పౌరుడిగా నమోదు దరఖాస్తుకు, ఆరు నెలలు, రెండు, ఐదు, 10 సంవత్సరాల సందర్శన వీసాల ఫీజులు కూడా పెరగనున్నాయి. ఉద్యోగం, చదువుకు సంబంధించిన కొన్ని దరఖాస్తులకు సైతం ఈ పెంపు వర్తిస్తుంది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని హోం శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment