Visiting Visa
-
యూకే విజిటింగ్, స్టూడెంట్ వీసా ఫీజుల మోత
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి, సందర్శక వీసా ఫీజులను త్వరలో భారీగా పెంచనుంది. విజిటింగ్ వీసాపై 15 పౌండ్లు, విద్యార్థి వీసాపై అదనంగా 127 పౌండ్లు పెంచుతున్నట్లు తెలిపింది. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి ఇవి వర్తిస్తాయని పేర్కొంది. ఈ పెంపుదల అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్లో హోంశాఖ ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టింది. దీని బిల్లు ప్రకారం ఆరు నెలల విజిటింగ్ వీసా ఫీజు ప్రస్తుతమున్న 100 పౌండ్ల నుంచి 115 పౌండ్ల(సుమారు రూ.12 వేలు)కు, విద్యార్థి వీసాకు ఫీజు 363 పౌండ్ల నుంచి 490 పౌండ్ల(సుమారు రూ.50 వేలు)కు పెరగనుంది. ఫీజుల పెంపు ఆరోగ్యం, సంరక్షణ వీసాతో సహా దాదాపు అన్ని రకాల వీసాలకు వర్తిస్తుంది; బ్రిటిష్ పౌరుడిగా నమోదు దరఖాస్తుకు, ఆరు నెలలు, రెండు, ఐదు, 10 సంవత్సరాల సందర్శన వీసాల ఫీజులు కూడా పెరగనున్నాయి. ఉద్యోగం, చదువుకు సంబంధించిన కొన్ని దరఖాస్తులకు సైతం ఈ పెంపు వర్తిస్తుంది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని హోం శాఖ తెలిపింది. -
అక్రమంగా అడుగిడుతూ.. ఇక్కడే స్థిరపడుతూ..
మనదేశంలో ఎంతమంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నారన్న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదు.’ తెలంగాణలో ఎందరు రోహింగ్యాలు పాస్‌పోర్టు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారన్న విషయంపై ఆర్టీఐ దరఖాస్తుకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇంకా సమాధానం వెల్లడించలేదు. సాక్షి,హైదరాబాద్: విజిటింగ్ వీసాల పేరిట భారత్‌లోకి వస్తున్న విదేశీయులు ఏం చేస్తున్నారు? వారిపై నిఘా ఉందా? మొన్న తబ్లిగీ జమాత్ కోసం వచ్చిన ఇండోనేషియన్లు విజిటింగ్ వీసాను దుర్వినియోగం చేయడం, వారివల్ల దేశంలో కరోనా వ్యాపించడంపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వీసాలు రద్దు చేసి, వారిపై వీసా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశాయి. అయితే ఇప్పటికే భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వల్ల దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అక్రమ వలసలకు తోడు విజిటింగ్ వీసాల మీద వచ్చిన వారిపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని పలు ముఠాలు భారత్‌లో మానవ అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా, దొంగనోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రదాడులకూ ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటిలో దొంగనోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ.. దేశంలో విధ్వంసాలకు కారణంగా మారుతోంది. 9 లక్షలకు పైగానే.. తబ్లిగీ జమాత్ ఉదంతం నేపథ్యంలో ఆగస్టు 2019 నుంచి మార్చి 2020 వరకు దేశంలోకి ఎందరు విజిటింగ్ వీసాలపై వచ్చారన్న సమాచారం ‘సాక్షి’ సేకరించింది. దీనిపై బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న భారత ఎంబసీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆగస్టు నుంచి మార్చి వరకు 9.6 లక్షల మంది బంగ్లాదేశీయులు విజిటింగ్ వీసాలపై భారత్‌లోకి వచ్చారు. అలాగే వియత్నాం నుంచి 1,126 మంది, కౌలాలంపూర్‌లోని 1,405 మంది ఇండోనేషియన్లకు భారత్‌లో పర్యటించేందుకు వీసాలు ఇచ్చామని వాళ్లెవరికీ మతపరమైన వీసాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. తెలంగాణలోనూ అధికంగా..! వివిధ దేశాల నుంచి విజిటింగ్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లట్లేదు. ఇలాంటి వారిలో కొందరు తెలంగాణలోనూ స్థిరపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిపి 10 వేల మందికిపైగానే రోహింగ్యాలు, ఇతర విదేశీయులు అక్రమంగా ఉంటున్నారని సమాచారం. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పిస్తుండగా మిగిలిన వారు భూములను కబ్జా చేసి స్థిర నివాసం ఏర్పరుచు కుంటున్నారు. ఆధార్, పాస్‌పోర్ట్, పా¯Œ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసె¯Œ ్స వంటి గుర్తింపు పత్రాలను సులువుగా సంపాదిస్తున్నారు. -
మర్కజ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల పర్యవసానాలు దేశం, రాష్ట్రంపై తీవ్రంగా ప్రభావం చూపిన నేపథ్యంలో వారిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. మర్కజ్ ప్రార్థనల కోసం వచ్చిన విదేశీయులు పలువురు విజిటింగ్ వీసాతో దేశానికి రావడమే కాకుండా, కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతున్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి స్థానికులకు కూడా వైరస్ ను వ్యాపింపజేశారు. దీంతో సోమవారమే కేసుల నమోదు ప్రారంభించిన తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి 146 మంది విదేశీయులపై వీసా ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్‌లో 84 మంది విదేశీయులపై 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశీయులకు ఆశ్రయమిచ్చిన వారిపైనా పోలీసులు కేసులు పెట్టారు. విదేశాల నుంచి రాష్రానికి వచ్చిన వారిలో ఇండోనేసియా, కిర్గిస్తాన్, మలేషియా, వియత్నాం, మయన్మార్‌కు చెందిన వారు ఉన్నారు. వీరందరిలో అత్యధికంగా నల్లగొండలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మంది మయన్మార్, వియత్నాంకు చెందిన 14 మంది ఉన్నారు. వీరికి ఆశ్రయమిచ్చిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో పర్యటించిన 14 మంది ఇండోనేసియన్లతో పాటు, వారికి ఆశ్రయమిచ్చినవారిపైనా కేసులు పెట్టారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. దీనిపై విచారణ ప్రారంభించిన కేంద్ర హోం శాఖ వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వీరంతా విజిటింగ్ వీసాలపై భారత్‌కు వచ్చినట్లు గుర్తించిన హోం శాఖ.. వారంతా ఎక్కడెక్కడున్నా రో వెంటనే గుర్తించి, వారి వీసాలు పరిశీ లించాలని ఆదేశించింది. అందులో వీసా, లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలు ఉంటే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మార్చి 16న కరీంనగర్‌కు వచ్చిన 14 మంది సభ్యులున్న ఇండొనేసియావాసుల వల్ల కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మర్కజ్లో అసలేం జరుగుతోందో తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి విన్నవించింది. -
నేర అతిథులపై నిఘా!
సాక్షి, హైదరాబాద్: అతిథి దేవో భవ అన్నది భారతీయ సంప్రదాయం. కానీ, వచ్చే అతిథుల్లో కొందరు వక్రబుద్ధిగలవారూ ఉంటారు. ఇలాంటివారిని వడబోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, భారత ప్ర భుత్వం పర్యాటక వీసాల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనివల్ల నేర చరిత్ర ఉన్నవారికి వీసా మంజూరులో కఠినంగా వ్యవహరించనున్నారు. ఎందుకీ మార్పులు? వాస్తవానికి పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే విదేశీయుల నేర చరిత్రపై గతంలో ఎలాంటి నిబంధనలు లేవు. కొంతకాలంగా మనదేశానికి వచ్చే విదేశీయుల్లో కొందరు ఇక్కడి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీనిపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్వయంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలకు ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. మేనకాగాంధీ చొ రవతో వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. ఇది ప్రస్తుతం అమల్లోకి వచ్చిందని సోమవా రం మేనకాగాంధీ ప్రకటించారు. చిన్నపిల్లలపై వేధింపులు, ఇతర నేరాలకు పాల్పడిన వి దేశీయులకు ఇపుడు ప్రత్యేక కాలమ్ ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా పూర్తిచేయాలి. అందులో అభ్యంతరాలు లేకపోతేనే వీసా మంజూరవుతుంది. లేదంటే తిరస్కరిస్తారు. దీ నిపై పలువురు మహిళలు, బాలల హక్కుల నే తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎలా ఉంది? దేశంలోని చారిత్రక నగరాల్లో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ చరిత్ర ఉన్న భాగ్యనగరాన్ని ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. కేవలం సందర్శనకే కాకుండా మెడికల్ టూరిజం, ఐటీ, ఉన్నత విద్య, ఫార్మసీ తదితర రంగాలకు భాగ్యనగరం ప్రసిద్ధి. దీనికితోడు శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఏటా నగరానికి వచ్చే విదేశీయులు పెరుగుతున్నారు. మధ్యప్రాచ్యం నుంచి వైద్యానికి, ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి ఉన్నత వి ద్యకు, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పర్యాటకం కోసం నగరానికి వ స్తున్నారు. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలో జరిగిన మార్పులను అందరూ ప్రశంసిస్తున్నారు. -
విజిటింగ్ వీసాతో ఏజెంట్ మోసం
నరసాపురం : మలేషియాలోని కంపెనీలో ఉద్యోగాలంటూ ఓ ఏజెంట్ నరసాపురం పట్టణానికి చెందిన నలుగురు యువకులకు వల వేశాడు. ఆ యువకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మలేషియా పంపాడు. విజిటింగ్ విసాపై వారిని మలేషియా పంపి ఏజెంట్ మోసం చేశాడు. వారిని మలేషియా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 97 రోజుల పాటు ఆ యువకులు అక్కడ నరకం అనుభవించారు. ఎట్టకేలకు వారి బంధువులు చేసిన ప్రయత్నాలు ఫలించి స్వదేశానికి వచ్చారు. శుక్రవారం ఉదయం సొంతూరుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన యర్రంశెట్టి సంతోష్ కుమార్, కొమ్మిన ప్రవీణ్‌బాబు, వేగి కిరణ్‌కుమార్, మొగల్తూరుకు చెందిన కొత్త చిట్టిబాబులను మలేషియాలో ఉద్యోగాలు ఉన్నాయంటూ నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి స్వామినాయుడు నమ్మించాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1.75 లక్షలు వసూలు చేసి గతేడాది నవంబర్‌లో మలేషియా తీసుకెళ్లాడు. వీసాలు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తానని ఏజెంట్ చెప్పడంతో అది నమ్మిన యువకులు నిబంధనలు తెలుసుకోకుండా మలేషియా వెళ్లారు. 3 నెలల విజిటింగ్ వీసా మీద తీసుకెళ్లినట్టుగా అక్కడికి వెళ్లాక వీరికి తెలిసింది. ముందు ఓ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6న వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు తమ వారు జైల్లో ఉన్నారని తెలిసిన కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సహా పలువురు అధికారులను కలిశారు. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకపోయింది. వారెవరూ పట్టించుకోలేదు. జైల్లో అక్కడి పోలీసులు దారుణంగా కొట్టడంతో ఆరోగ్యాలు కూడా క్షీణించాయి. పోలీసులను బతిమాలి ఫోన్ తీసుకుని ఎన్నిసార్లు మాట్లాడినా ఆ దేశంలోనే ఉన్న ఏజెంట్ కనికరించలేదని యువకులు వాపోయారు. ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టికెట్లు తీయించి పంపితే స్వదేశానికి పంపిస్తామని పోలీసులు ఒప్పుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు విమానం టికెట్లు తీయించి పంపించారు. ఈనెల 11న వారిని అక్కడి పోలీసులు విడుదల చేసి విమానం ఎక్కించారు. వారు శుక్రవారం నరసాపురం చేరుకున్నారు. యర్రంశెట్టి సంతోష్ కుమార్, కొమ్మిన ప్రవీణ్‌బాబు, వేగి కిరణ్‌కుమార్ నరసాపురం చేరుకోగా మరో యువకుడు కొత్త చిట్టిబాబు ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఏజెంట్ కొప్పినీడి స్వామినాయుడుపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు యువకులు చెప్పారు. -
ఇండియన్స్ విజిటింగ్ వీసాలపై రావద్దు!
దుబాయి(యూఏఈ): ఉపాధి కోసం యూఏఈ రావాలనుకునే వారు విజిటింగ్ వీసాలపై మాత్రం ఇక్కడికి రావద్దని యూఏఈ ప్రభుత్వం భారతీయులను కోరింది. వీసా మోసాలు, నకిలీ ధ్రువపత్రాలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్న నేపథ్యంలో యూఏఈ ఈ మేరకు సూచనలు వెలువరించిందని దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం వివరించింది. ప్రతిరోజు ఇందుకు సంబంధించి వందలాదిగా బాధితుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపింది. ఇలా మోసపోయి విజిటింగ్ వీసాలపై 2016లో యూఏఈకి వచ్చిన 225 మంది భారతీయులను, 2017లో ఇప్పటివరకు 186 మందికి టికెట్లు కొనుగోలు చేసి ఇచ్చి ప్రభుత్వం వెనక్కి పంపిందని పేర్కొంది. నకిలీ వీసాలను భారతదేశంలో గుర్తించటం చాల కష్టమని భారత రాయబార కార్యాలయం వివరించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి కోసం వచ్చే భారతీయులు నమ్మకమైన వారి ద్వారా కచ్చితమైన ఉద్యోగ వీసా పత్రాలను, ధ్రువీకరణలను పొందాలని లేని పక్షంలో కష్టాలు తప్పవని హెచ్చరించింది. -
‘గల్ఫ్’ గోస పట్టించుకోరా?
రాయికల్: పొట్ట చేతపట్టుకొని ఏడారి దేశాలకు వెళ్లిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వారి సమస్యలను వినేందుకు కనీసం ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని, కేరళ తరహాలో పటిష్టమైన వ్యవస్థను రూపొందించి అమలు చేస్తామని హామీలిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతున్నా ప్రత్యేక మంత్రిత్వ శాఖ గానీ, ప్రత్యేక వ్యవస్థ గానీ రూపుదాల్చలేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని గల్ఫ్ బాధితులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి సుమారు పదిహేను లక్షల మంది కార్మికులు ఉపాధికోసం గల్ఫ్‌బాట పట్టారు. ఏజెంట్లు, దళారుల మాయమాటలు నమ్మి, తీరా ఆయా దేశాలకు వెళ్లిన తర్వాత పరిస్థితి తారుమారు అవుతోంది. ఏజెంట్లు చెప్పిన పని లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చేందుకు తక్కువ జీతాలకు ఏ పని దొరికినా కాదనకుండా చేయాల్సి వస్తోంది. ఏజెంట్ల మోసం నకిలీ వీసాలు, సందర్శక వీసాలపై వెళ్లిన పలువురు అక్కడి పోలీసులకు చిక్కి జైలుపాలవుతున్నారు. అనార్యోగం కారణాలు, ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల శవాలు స్వస్థలాలకు రావడానికి నెలలు పడుతోంది. వివిధ కారణాలతో తిరిగివచ్చిన కార్మికులు ఇక్కడ సరైన ఉపాధి లేక సతమతమవుతున్నారు. మరికొంతమంది చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలెన్నో. ఇవ్వన్నీ ఒక ఎత్తయితే, గతేడాది దుబాయ్, సౌదీఅరేబియా దేశాలు ఆంక్షలు విధించినప్పుడు స్వదేశం తిరిగి వచ్చేందుకు వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. స్వదేశం రాలేక ఆంక్షల గడువు ముగిసిన తర్వాత కూడా దొంగచాటుగా పనిచేసుకుంటున్న వందలాది మంది జైళ్లపాలయ్యారు. ఇటీవల ఇరాక్‌లో అంతర్యుద్ధం నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన పలువురు ఆయా కంపెనీల శిబిరాల్లో తలదాచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని స్వదేశానికి తీసుకొచ్చినప్పటికీ ఇంకా వేలాది మంది కార్మికులు ప్రాణభయంతో అక్కడే బిక్కుబిక్కుమంటున్నారు. కేరళలో ఇలా... వలస కార్మికుల రక్షణ విషయంలో కేరళ రాష్ట్ర పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తమ పౌరులకు ఏ ఆపద వచ్చినా ఆగమేఘాలపై స్పందించి తగిన రక్షణ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ యంత్రాంగం విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పేర్లు నమోదు చేసుకోవడం మొదలు ఆయా దేశాల్లో పని పద్ధతులు, అక్కడ మెలగాల్సిన తీరుపై ముందుగా కార్మికులకు అవగాహన కల్పిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవాసాంధ్రుల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం పాలకులు ఆ శాఖను నిర్వీర్యం చేయడమే కాకుండా కొంతకాలానికి దానిని ఎత్తివేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలోప్రవాస తెలంగాణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని గల్ఫ్ బాధితులు కోరుతున్నారు. తద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.