హైదరాబాద్ : పదేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 90,000 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యిందని అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా పేర్కొన్నారు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లే భారత విద్యార్థులు గత ఏడాది కంటే ఈ ఏడాది 12 శాతం పెరిగారని చెప్పారు. న్యూఢిల్లీలోని ఎంబసీ కార్యాలయంతో పాటు హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నై, ముంబై నగరాల్లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో బుధవారం ‘స్టూడెంట్ వీసా డే’నిర్వహించారు. ఆయా కార్యాలయాల ద్వారా ఒక్కరోజే 4,000 మందికి వీసాలు జారీ చేసినట్లు యూఎస్ కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ కార్యాలయంలో 16 మంది విద్యార్థులకు క్యాథరిన్ హడ్డా వీసాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా యూఎస్‌కు వచ్చేవారిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. అమెరికాకు చదువులకు వెళ్లే ప్రతి ఆరుగురిలో ఒక భారతీయ విద్యార్థి ఉన్నాడన్నారు. ఈ క్రమంలో భారత, అమెరికా మధ్య బంధాన్ని మరింత పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన సినీనటుడు అడవి శేషు, ప్రముఖ పారిశ్రామికవేత్త వీణారెడ్డి మాట్లాడుతూ.. తాము అమెరికాలో ఉన్నత చదువులు చదివి తమ కెరీర్‌ను ఇక్కడే మలచుకున్న తీరును, అనుభవాలను వివరించారు. యూఎస్‌లో అన్ని దేశాలకు చెందిన విద్యార్థులను కలిసే అవకాశం ఉంటుందని, ఈ క్రమంలో ఒకరికొకరు పరస్పరం మేథస్సును, సంస్కృతిని పంచుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment