సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : డాలర్ కల చెదురుతోంది! అమెరికా కొలువులు ఇక అందని ద్రాక్ష కానున్నాయి. అక్కడ భారత విద్యార్థులకు, వర్క్ వీసాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోంది. మూడేళ్ల క్రితమే మొదలైన ఈ తేడా ఈ ఏడాది ఏకంగా రెట్టింపైంది. అమెరికాలో ఉద్యోగం చేయొచ్చన్న ఆశతో లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నా.. ఆ దేశం ఏటా జారీ చేస్తున్న వర్క్ వీసాల సంఖ్య మాత్రం 85 వేలు దాటడం లేదు. దీంతో మున్ముందు ఉద్యోగాలు దొరక్క భారతీయ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఏటేటా పెంచుకోవడం ద్వారా గతేడాది అమెరికన్ విశ్వవిద్యాలయాలు 70 కోట్ల డాలర్ల టర్నోవర్‌ను దాటాయి. ఇలా అమెరికా ప్రభుత్వం ఓవైపు విద్యార్థులను ఆకర్షిస్తూనే మరోవైపు హెచ్1బీ వీసాలపై సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుతం ఉన్న 85 వేల హెచ్1బీ వీసాల గరిష్ట పరిమితి భవిష్యత్‌లోనూ కొనసాగితే 2020 నుంచి ఏటా లక్ష మంది భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుందని కొలంబియా బిజినెస్ స్కూల్ రీసెర్చ్ స్కాలర్ సూరజ్ బజాజ్ అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఆ సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదని అమెరికాలో బ్యాంకింగ్ నిపుణుడు శ్రీనివాసన్ రాధాకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు.
వీసా గడువు ముగుస్తున్న దశలో రెన్యువల్ కోసం వస్తున్న దరఖాస్తులను కూడా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సీఐఎస్) నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తోంది. హెచ్1బీ వీసాల జారీ, గడువు పొడిగింపు వంటి అంశాల్లో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. హెచ్1బీ వీసా నిబంధనలను కచ్చితంగా అమలు చేసి తీరాలని 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే యూఎస్ విమానాశ్రయాల నుంచి విద్యార్థులను వెనక్కి పంపడం, హెచ్1బీ గడువు పెంపు కోసం వచ్చిన దరఖాస్తులను కఠిన పరిశీలన చేసి తిరస్కరించడం వంటి చర్యలు మొదలయ్యాయి.
నాలుగేళ్ల క్రితమే మొదలైన పోటీ
హెచ్1బీ వీసాల కోసం భారతీయుల పోటీ 2014లోనే మొదలైంది. అంతకుముందు సంవత్సరాల్లో 35 నుంచి 40 వేలలోపు మాత్రమే ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2014 తర్వాత లక్ష దాటింది. 2014 దాకా వీసాల జారీకి పరిమితి లేకపోవడంతో దరఖాస్తు చేసిన దాదాపు ప్రతి పది మందిలో 8 మందికి ఉద్యోగ వీసాలు లభించేవి. కానీ 2015లో వీసాలకు పరిమితి విధించడంతో ఏటేటా భారతీయుల బ్యాక్‌లాగ్ (హెచ్1బీ వీసాల కోసం) పెరుగుతూ వస్తోంది. 2015, 2016, 2017లో 1,26,292 మందికి వీసాలు లభించలేదు.
ఈ ఏడాదిలో వీసా కోసం భారతీయుల నుంచి వచ్చిన దరఖాస్తులు మొత్తం 1.68 లక్షలు. వీరిలో 71,675 మందికి మాత్రమే హెచ్1బీ వీసాలు మంజూరయ్యాయి. వాటిలోనూ వెరిఫికేషన్ తర్వాత 3 నుంచి 5 శాతం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. వీరంతా అర్హత ఉంటే 2019 ఏప్రిల్‌కు మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కోసం మూడేళ్లు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. ఈ మూడేళ్లలో హెచ్1 బీ వీసా లభించకపోతే తిరిగి స్వదేశం వెళ్లడమో లేదా మళ్లీ విశ్వవిద్యాలయాల్లో చేరిపోవడమో తప్ప వేరే మార్గం ఉండదు.
గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్లు ఉద్యోగం చేసినా వీసా దొరకని వారు అప్పటిదాకా కూడబెట్టుకున్న సొమ్ముతో తిరిగి ఇతర కోర్సుల్లో చేరేందుకు మళ్లీ ఎఫ్–1 (విద్యార్థి వీసా)కు మారిపోతున్నారు. గడచిన రెండేళ్లలో దాదాపు లక్ష మంది ఓపీటీ గడువు ముగిసినా వీసా రాక అక్కడే వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో ఇతర కోర్సుల్లో చేరిపోయారని సూరజ్ బజాజ్ తన పరిశీలన పత్రంలో వెల్లడించారు.
రెన్యువల్‌కు సవాలక్ష ఆంక్షలు
గతంలో హెచ్1బీ వీసా రెన్యువల్ చేసే విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉదారంగా వ్యవహరించేవారు. కానీ గడచిన మూడేళ్లుగా నిబంధనలు కఠినం చేశారు. వీసా పొందిన మూడేళ్లు క్రమం తప్పకుండా పన్ను చెల్లించారా లేదా అన్న అంశంతోపాటు 36 నెలలు నెలనెలా బ్యాంక్‌లో వేతనం జమ అయిందా లేదా అన్న వివరాలు పరిశీలిస్తున్నారు. ఏ కారణం చేత అయినా 6 నెలలు లేదా ఏడాది ఖాళీగా ఉంటే వీసాను పునరుద్ధరించడం లేదు. గడచిన మూడేళ్లలో 1.38 లక్షల మంది వీసాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. అంటే ఏటా సగటున 45 వేల మంది అక్కడ ఉద్యోగం ఉండి కూడా తిరుగుముఖం పడుతున్నారన్నమాట! ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అక్కడి ఇమిగ్రేషన్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: నిపుణులు
ఉద్యోగం కోసం అమెరికాలో విద్య అభ్యసించాలనుకునేవారు ముందు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఉద్యోగం కోసమే అయితే భారీగా అప్పులు చేసి అమెరికాలో చదవాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంచిది కాదంటున్నారు. వర్క్ వీసాల (ఎల్1) విషయంలో ఇప్పటికే ఐటీ కంపెనీలను కట్టడి చేసిన అమెరికా ప్రభుత్వం తదుపరి హెచ్1బీ విషయంలోనూ నిబంధనలు కఠినతరం చేసే ఆలోచన చేస్తోందని గడచిన ఏడాదిన్నరగా అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్న కొలంబియా బిజినెస్ స్కూల్ రీసెర్చ్ స్కాలర్ సూరజ్ బజాజ్ అభిప్రాయపడ్డారు.
అత్యంత ప్రతిభావంతులు, ఆర్థిక స్థోమత కలిగి ఉన్నవారు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని, ఎటొచ్చి బ్యాంకు రుణాలతో చదవాలనుకునే వారికి మాత్రం ‘రిస్క్’ఉంటుందని ఆయన అన్నారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం ఈ ఏడాది వచ్చే విద్యార్థుల సంఖ్య 2.10 లక్షల కంటే ఎక్కువే ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి సీజన్ (ఫాల్)కు వచ్చేవారి సంఖ్య 1.18 లక్షలు దాటిందని, రెండో సీజన్ (స్ప్రింగ్)కు విద్యార్థుల సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూఎస్‌సీఐఎస్ అంచనా. గడచిన మూడేళ్లలో అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చిన వారి సంఖ్య 4.75 లక్షలు. ఈ ఏడాది విద్యార్థులను కలుపుకుంటే సుమారు 7 లక్షలకు చేరుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment