రెడీ స్టడి గో | Admissions process has started in many countries | Sakshi
Sakshi News home page

రెడీ స్టడి గో

Published Thu, Jul 4 2024 7:01 AM | Last Updated on Thu, Jul 4 2024 7:13 AM

Admissions process has started in many countries

వచ్చే నెల నుంచే పలు దేశాల్లో అడ్మిషన్ల ప్రక్రియలు ప్రారంభం
సరైన అవగాహనతో ముందుకెళితే సమస్యలు రాకుండా ఉంటాయంటున్న నిపుణులు
విదేశీ విద్యకు అర్హతలు, అవకాశాలపై సూచనలివీ 

ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా విదేశీ విద్య వైపు చూస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.

వారంతా విదేశాలకు వెళ్లే ముందు హైదరాబాద్‌కే చేరుతున్నారు. ఇక్కడున్న కన్సల్టెన్సీలను సంప్రదించి విదేశీ విద్య కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చే నెలలోనే కొత్తగా అడ్మిషన్ల ప్రక్రియలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సరైన అవగాహనతో ముందుకెళితే.. సులువుగా విదేశీ విద్య పూర్తి చేసుకోవచ్చని, మంచి జాబ్‌ కూడా సంపాదించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అసలు విదేశీ విద్యకు అర్హతలు, తీసుకో వాల్సిన జాగ్రత్తలేమిటో స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

అవకాశం, అవగాహన పెరగడంతో..
విదేశాల్లో విద్య అంటే ఒకప్పుడు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమన్న భావన ఉండేది. దానికితోడు పెద్దగా అవగాహన లేకపోవడంతో.. విదేశాలకు వెళ్లడం ఎందుకులేనన్న పరిస్థితి ఉండేది. కానీ పెరిగిన అవకాశాలు, అవగాహన, ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారితో సులువుగా అనుసంధానమయ్యే వీలు వంటివి.. విదేశాలకు వెళ్లి చదువుకునేవారి సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది. పాస్‌పోర్టు జారీ విధానం సులభతరం కావడం, విదేశాల వీసాలు సులువుగా దొరుకుతుండటం, స్కాలర్‌ షిప్‌లతో అవకాశాలూ పెరిగాయి. మరోవైపు స్థానికంగా విద్య కోసం ఖర్చులు కూడా బాగా పెరిగిన నేపథ్యంలో.. మరింత అదనంగా ఖర్చు చేస్తే విదేశాల్లో చదువుకోవచ్చని, అక్కడే ఉద్యోగమూ సంపాదించవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.

స్టూడెంట్‌ వీసా తీసుకుని..
 స్టూడెంట్‌ వీసా ఉంటే ఆ దేశంలోసంబంధిత కోర్సు పూర్తయ్యేంత వరకు ఉండి చదువుకునేందుకు అనుమతిఉంటుంది. తర్వాత కూడా రెండేళ్ల పాటు వర్క్‌ పర్మిట్‌ మీద ఉండేందుకు అనుమతిస్తారు.ఆ రెండేళ్లలోగా సరైన ఉద్యోగం పొందలేకపోతే.. స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
 స్టూడెంట్‌ వీసా కోసం ఏ దేశానికి వెళ్లాలనుకుంటే ఆ దేశానికి చెందిన కాన్సులేట్‌ కార్యాలయం లేదా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా వీసా అప్లికేషన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
 విద్యార్థులకు అమెరికా అయితే ఎఫ్, ఎం, జే వీసాలు ఇస్తుంది. యూకే అయితే టైర్‌–4 వీసాలు జారీ చేస్తుంది. కెనడా స్టడీ పర్మిట్స్‌ పేరిట ఇస్తుంది.

హైదరాబాద్‌ నుంచే ఎక్కువ
అమెరికాకు గతేడాది 75,000 మంది ఇండియా నుంచి వెళ్తే..
అందులో హైదరాబాద్‌ నుంచే 22,500 మంది ఉన్నట్టు అంచనా. ఇక కెనడాకు మొత్తం 1.3 లక్షల మంది వెళ్లగా.. దాదాపు 35,000 మంది హైదరాబాద్‌ మీదుగా వెళ్లారని.. ఇందులో సిటీవారే ఎక్కువని ఓపెన్‌ డోర్‌ సంస్థ నివేదిక చెబుతోంది. మిగతా దేశాలకు కూడా హైదరాబాద్‌ నుంచి వెళ్లిన విద్యార్థులే ఎక్కువని పేర్కొంటోంది.

ఏమేం అర్హతలు ఉండాలి?
  చదువుకున్న కాలేజీ నుంచి కండక్ట్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.
   సరైన పాస్‌పోర్టు ఉండాలి. 
⇒  ఆదాయ వనరులు సరిగ్గా ఉండాలి
   ఆంగ్లంలో నైపుణ్యం ఉండాలి (ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్‌లో మంచి స్కోర్‌ కలిగి ఉండాలి)
 మెడికల్, పోలీస్‌ క్లియరెన్స్‌ ఉండాలి.
  టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, డుయో లింగో, ఎస్‌ఏటీ, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో స్కోరును బట్టి యూనివర్సిటీలు అడ్మిషన్లు ఇస్తుంటాయి. ఒక్కో దేశంలోని ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పరీక్షలో స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది.

 వీసా కోసం అప్లికేషన్‌ చేసుకున్న తర్వాత కాన్సులర్‌ అధికారితో ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు దరఖాస్తులో అందజేసిన వివరాలు సరైనవేనా, కాదా అనే విషయాన్ని ఇంటర్వ్యూలో రూఢి చేసుకుంటారు. అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? చదువు అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలపై సమగ్రంగా ప్రశ్నలు అడుగుతారు.

వీసాలు రిజెక్ట్‌ అవుతుంటాయి.. ఎందుకు? 
విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నవారికి ఒక్కోసారి వీసా రిజెక్ట్‌
అవుతుంటుంది. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి.
 ఆదాయ వనరులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం
 డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడం.
 చదువు పూర్తయ్యాక తిరిగి స్వదేశం వెళతామని రుజువు చేయలేకపోవడం
  చదువులో మంచి మార్కులు లేకపోవడం ళీఏదైనా తప్పులు లేదా ఫ్రాడ్‌ చేయడం

విదేశాల్లో స్కాలర్‌షిప్‌ పొందడమెలా?
విదేశాలకు చదువు కోసం వెళ్తున్న అందరికీ అక్కడి వర్సిటీల్లో
ఫీజులు చెల్లించే స్తోమత ఉండకపోవచ్చు. అందువల్ల కాస్త ఆర్థిక భారం
తగ్గించుకునేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కాలర్‌షిప్‌ పొందడం కూడా సులువే..

1. విదేశాల్లో వర్సిటీలు మాత్రమే కాకుండా వేరే సంస్థలు కూడా స్కాలర్‌షిప్స్‌ ఇస్తుంటాయి. అందుకే యూనివర్సిటీ వెబ్‌సైట్లతోపాటు స్కాలర్‌షిప్‌లు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లను కూడా తరచూ చూస్తుండాలి.
2. విదేశాలకు వెళ్లాలనుకోవడానికి ఏడాది ముందే స్కాలర్‌షిప్‌ల గురించి వెతుకుతుండాలి. ముందుగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
3. చాలా స్కాలర్‌షిప్‌ టెస్టుల కోసం అడ్మిషన్‌ లెటర్‌ అవసరం ఉండదు. అందుకే అడ్మిషన్‌ లెటర్‌ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలనుకోవడం సరికాదు.
4. పూర్తి స్థాయి స్కాలర్‌షిప్‌ కాకుండా కొంతమేరకే వస్తే మాత్రం వేరే స్కాలర్‌షిప్‌ల కోసం కూడా వెతకాలి. ఒకటికన్నా ఎక్కువ స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం కూడా ఉంటుంది.
5. మెరిట్‌ ఉన్న విద్యార్థులకే స్కాలర్‌షిప్‌ వస్తుందనుకోవడం పొరపాటు. స్పోర్ట్స్, ఇతర నైపుణ్యాల ఆధారంగా కూడా స్కాలర్‌షిప్‌ ఆఫర్‌ చేసే సంస్థలు చాలా ఉంటాయి. వాటిని గుర్తించాలి.

టోఫెల్‌లో అక్రమాలతో ఇబ్బంది..
గతేడాది టోఫెల్‌ పరీక్షలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. టోఫెల్, జీఆర్‌ఈలో మార్కులు ఎక్కువ వచ్చేలా చేస్తామంటూ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వల వేసిన గుట్టు రట్టయింది. అలాంటి వారిని నమ్మి పరీక్షలు రాయిస్తే.. తీరా విదేశాలకు వెళ్లాక అది ఫేక్‌ అని తేలితే చిక్కులు తప్పవు. ఆ విద్యార్థులను భారత్‌కు తిప్పిపంపడమేగాక.. భవిష్యత్తులో మళ్లీ విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించే ప్రమాదం ఉంటుంది. 

స్టూడెంట్‌ ఎక్సే్ఛంజ్‌ ప్రోగ్రామ్స్‌తో వెళ్లొచ్చు
భారత విద్యార్థులు విదేశాల్లోని అవకాశాలు అందిపుచ్చుకునేలా.. ఆయా దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వాటిద్వారా మన విద్యార్థులు విదేశాల్లోని వర్సిటీల్లో కొంతకాలం చదువుకొనేందుకు అవకాశం ఉంటుంది. ‘సెమిస్టర్‌ ఎట్‌ సీ, రోటరీ యూత్‌ ఎక్సే్ఛంజ్‌ , ఎరామస్‌ ప్లస్, ఫుల్‌ బ్రైట్‌ నెహ్రూ ఎక్సే్ఛంజ్‌ ప్రోగ్రామ్, యూత్‌ ఫర్‌ అండర్‌ స్టాండింగ్‌’ వంటి కార్యక్రమాల ద్వారా విదేశాల్లోని విద్యార్థులతో కలసి చదువుకుని, అక్కడి స్థితిగతులను అర్థం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఉద్యోగ అనుభవంతో వెళ్తే మేలు..
విదేశాల్లో చదువుతోపాటు అక్కడే స్థిరపడాలనుకునే వారు డిగ్రీ అయిపోయాక ఇక్కడ కనీసం రెండేళ్లపాటు ఏదైనా ఉద్యోగం చేసి
ఉంటే మంచిది. దీనివల్ల విదేశాల్లో ఎంఎస్‌ అయ్యాక.. ఇక్కడి అనుభవంతో అక్కడ ఉద్యోగం సులువుగా పొంది, స్థిరపడేందుకు అవకాశాలు మెండుగాఉంటాయి. ఏ దేశంలో త్వరగా సెటిల్‌ కాగలమో ముందుగానే తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ఐర్లాండ్‌ వంటి దేశాల్లో ఐదేళ్లలోనే గ్రీన్‌కార్డు వస్తుంది.
సందీప్‌రెడ్డి , ఐర్లాండ్‌ 

ప్రస్తుత పరిస్థితులు బాగోలేవు
అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు అంత బాగోలేవు. ఆర్థిక మాంద్యం నడుస్తోంది. రెండేళ్ల నుంచీ ఉద్యోగాల్లేవు. ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. స్టూడెంట్స్‌ చాలా మంది చదువు కోసం వస్తున్నారు. వారికి పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ దొరకట్లేదు. ఇంటి అద్దెతోపాటు కూరగాయలు, నిత్యావసర ధరలు కూడాభారీగా పెరిగాయి. దీంతో ఇక్కడ జీవనం కష్టంగా మారుతోంది. 
సాయి సింధూజ న్యూజెర్సీ 

వర్సిటీలపై స్టడీ చేయాలి 
ముందుగానే ఏ యూనివర్సిటీమంచిదో కాస్త పరిశోధన చేయాలి. ఆ తర్వాతే కన్సల్టెన్సీల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అదే నేరుగా కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తే.. సరైన కాలేజీ లేదా యూనివర్సిటీకి దరఖాస్తు చేయకపోవచ్చు. తర్వాత బాధపడి ఏమీ లాభం ఉండదు. కొన్ని కన్సల్టెన్సీలు ఎక్కువ కమీషన్‌ ఇచ్చే వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తుంటాయి. అందుకే వర్సిటీలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.
నిఖిల్‌ మండల, మాంచెస్టర్, బ్రిటన్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement