
విదేశీ విద్య
విదేశాల్లో పరిశోధన కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు అత్యుత్తమ గమ్యస్థానం.. జర్మనీ. ముఖ్యంగా ఇంజనీరింగ్, అప్లైడ్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌లో పరిశోధనలకు పెట్టింది పేరు. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తుంది జర్మనీలోనే. ప్రపంచవ్యాప్తంగా టాప్-250 యూనివర్సిటీల్లో 17 జర్మన్ యూనివర్సిటీలే. అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను, ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఎడ్యుకేషన్‌పై ఫోకస్..
380 యూనివర్సిటీలు- 15 వేలకి పైగా కోర్సులు:
జర్మనీకి వెళ్లాలనుకునే విద్యార్థులు.. ముందుగా తమకు సరితూగే యూనివర్సిటీని/కోర్సును ఎంచుకోవాలి. అధికారిక గుర్తింపు ఉన్న 380 యూనివర్సిటీల్లో కనీసం 15 నుంచి 20 యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటే ప్రవేశ అవకాశాలు మెరుగుపడతాయి. ఇంజనీరింగ్ మొదలు ఎకనామిక్స్, సోష ల్ సెన్సైస్, లా, లాంగ్వేజెస్, కల్చరల్ స్టడీస్, కంప్యూటర్ సెన్సైస్, మెడిసిన్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఆర్ట్ అండ్ మ్యూజిక్, స్పోర్ట్స్‌లో వివిధ సబ్జెక్టుల్లో.. దాదాపు 15,000కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్యాచిలర్, మాస్టర్, పీహెచ్‌డీ/డాక్టోరల్, ప్రిపరేటరీ కోర్సు, లాంగ్వేజ్ కోర్సులు, షార్ట్ టర్మ్ కోర్సుల రూపంలో ఉన్నాయి.
ఈ 380 యూనివర్సిటీల్లో 240 యూనివర్సిటీలు ప్రభుత్వ పరిధిలోనివే. ఇవి అతి తక్కువ ఫీజులకే విద్యనందిస్తున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు పబ్లిక్ యూనివర్సిటీల్లో చదవడానికి మొగ్గు చూపిస్తారు. ప్రైవేటు యూనివర్సిటీలు 100 వరకు ఉన్నాయి. వీటిల్లో ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. మరో 40 యూనివర్సిటీలు క్యాథలిక్ చర్చి పరిధిలో ఉన్నాయి. జర్మనీలో యూనివర్సిటీలు మూడు రకాలుగా ఉంటాయి. అవి.. రీసెర్చ్ ఓరియెంటెడ్ స్టడీ యూనివర్సిటీలు, ప్రాక్టీస్ ఓరియెంటెడ్ స్టడీ యూనివర్సిటీలు (యూనివర్సిటీస్ ఆఫ్ అప్లైడ్ సెన్సైస్), ఆర్ట్స్-మ్యూజిక్ సంబంధిత కాలేజీలు. బోధన.. థియొరాటికల్ నాలెడ్జ్, రీసెర్చ్, ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌లో సాగుతుంది. అంతేకాకుండా పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులను సంబంధిత కోర్సుల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతారు.
అర్హతలు:
బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2, మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ కోర్సులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితోపాటు కోర్సును బట్టి జీఆర్‌ఈ /టోఫెల్/ఐఈఎల్‌టీఎస్/జీమ్యాట్‌లో నిర్దేశిత స్కోర్ సాధిం చి ఉండాలి. కొన్ని కోర్సులకు ప్రత్యేక అర్హతలు తప్పనిసరి. జర్మన్ మాధ్యమంలో అభ్యసించాలంటే జర్మన్‌లో ప్రావీణ్యం ఉండాలి. మరిన్ని వివరాలకు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్స్ చూడొచ్చు. కోర్సు ప్రారంభానికి ఆరు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశం:
జర్మనీలో ప్రవేశం రెండు సెమిస్టర్లుగా ఉంటుంది. అవి.. వింటర్ సెమిస్టర్, సమ్మర్ సెమిస్టర్. వింటర్ సెమిస్టర్ ప్రవేశాలు అక్టోబర్‌లో మొదలవుతాయి. మే చివరి నుంచి జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశం లభించిన విద్యార్థులకు ఆగస్టు/సెప్టెంబర్‌లో తెలియజేస్తారు. సమ్మర్ సెమిస్టర్ ప్రవేశాలు ఏప్రిల్‌లో మొదలవుతాయి. డిసెంబర్ మొదటివారం నుంచి జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి/మార్చిలో ప్రవేశం లభించిన విద్యార్థులకు యాక్స్‌ప్టెన్స్ లెటర్ పంపిస్తారు. ఆన్‌లైన్ ద్వారా ఆయా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా జర్మనీ అంతర్జాతీయ కార్యాలయాలను/సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఫోన్/మెయిల్ ద్వారా కూడా అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ట్యూషన్ ఫీజులు:
ఎంచుకున్న సబ్జెక్టు, యూనివర్సిటీని బట్టి ఫీజులు ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు సెమిస్టర్‌కు 650 యూరోల నుంచి 10000 యూరోల వరకు, మాస్టర్స్ డిగ్రీ (ఒకటి లేదా రెండేళ్లు) కోర్సులకు సెమిస్టర్‌కు 10000 యూరోలు ఉంటుంది. నివాసం, భోజనం, ఆరోగ్య బీమా, ఇతర ఖర్చులు వీటికి అదనం. ఇవన్నీ కలిపి నెలకు మరో 1000 యూరోల వరకు అవుతాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో వీటికి రెట్టింపు స్థాయిలో ఫీజులు ఉంటాయి. అయితే ఈ ఖర్చులను తట్టుకోవడానికి జర్మనీ భారీ స్థాయిలో స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. డాడ్ స్కాలర్‌షిప్స్, రీసెర్చ్ గ్రాంట్స్ ఫర్ డాక్టోరల్ స్టడీస్, బిలేటరల్ ఎక్స్ఛేంజ్ అకడెమిక్స్ స్కాలర్‌షిప్స్ ఇలా ఎన్నో స్కాలర్‌షిప్స్ భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా భారీ మొత్తంలో స్కాలర్‌షిప్ పొందొచ్చు.
మూడు రకాల వీసాలు:
జర్మనీ ఉన్నత విద్య ఔత్సాహికులకు మూడు రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. లాంగ్వేజ్ కోర్స్ వీసా, స్టడీ అప్లికెంట్స్ వీసా, స్టూడెంట్ వీసా. వీటిలో స్టూడెంట్ వీసాకు మాత్రమే దీర్ఘకాలిక కాలపరిమితి ఉంటుంది. లాంగ్వేజ్ కోర్స్ వీసాను.. సంబంధిత కోర్సు కాలపరిమితి మేరకే మంజూరు చేస్తారు. యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుని ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు మంజూరు చేసేవే స్టడీ అప్లికెంట్స్ వీసా. అయితే దీన్ని పొందిన విద్యార్థులు నిర్దేశిత కోర్సులో ప్రవేశం పొందగానే కచ్చితంగా స్టూడెంట్ వీసా కేటగిరీకి మార్చుకోవాలి. ఇతర దేశాల మాదిరిగానే వీసా దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్, స్టడీ సర్టిఫికెట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ జతపర్చాలి.
ముఖ్యమైన వెబ్‌సైట్లు
www.daad.de/en
www.studyingermany.de
www.bmbf.de/en
www.workpermit.com
www.india.diplo.de