విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్‌! | US Says Foreign Students Whose Classes Move Online Cannot Stay Amid Covid 19 | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన అమెరికా!

Published Tue, Jul 7 2020 8:50 AM | Last Updated on Tue, Jul 7 2020 5:18 PM

US Says Foreign Students Whose Classes Move Online Cannot Stay Amid Covid 19 - Sakshi

వాషింగ్టన్‌: విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాకిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు విద్యా సంస్థలు మొగ్గు చూపినట్లయితే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం. అలాంటి వారిని యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ దేశంలోకి అనుమతించదు. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా(ఎఫ్‌-1 ఎం-1-తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది, లేదా చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్న విద్యా సంస్థకు బదిలీ చేయించుకోవాలి. అలా జరగని పక్షంలో ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’అని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. (హెచ్‌ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!)

కాగా ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపై దుష్ప్రభావం చూపనుంది. ఇక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి గానూ అమెరికాలో దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు చైనా, భారత్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా నుంచి వచ్చినవాళ్లే. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా కోల్పోయిన సిలబస్‌, కొత్త సెమిస్టర్లకు సంబంధించి తమ విధానం ఎలా ఉండబోతుందో పలు కాలేజీలు, యూనివర్సిటీలు ఇంతవరకు స్పష్టం చేయలేదు. మరికొన్ని విద్యాసంస్థలు వర్చువల్‌ క్లాసెస్‌తో పాటు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు విద్యార్థులకు అవకాశమిస్తామని పేర్కొనగా.. హార్వర్డ్‌ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులకే మొగ్గుచూపాయి.

మరోవైపు.. అమెరికాలో కరోనా రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 29 లక్షల మంది మహమ్మారి బారిన పడగా.. దాదాపు లక్షా ముప్పై వేల మంది కరోనాతో మృతి చెందారు. ఇలాంటి తరుణంలోఅమెరికాలో ఉంటే కాలేజీకి వెళ్లాలి లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాలి అన్నట్లుగా ట్రంప్‌ సర్కారు నిర్ణయం ఉందంటూ ఇమ్రిగ్రేషన్‌ అటార్నీ సైరస్‌ మెహతా విమర్శించారు. ట్రంప్‌ క్రూర పాలనకు ఇది నిదర్శనం.. విదేశీ విద్యార్థుల ప్రాణాలను అపాయంలోకి నెట్టారు అంటూ డెమొక్రాట్లు మండిపడుతున్నారు. (కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement