బ్రిటన్ విద్యార్థి వీసాల్లో కోత!
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి వీసాల సంఖ్యను భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. భారత్ సహా ఐరోపా బయటి దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య నానా టికీ తగ్గుతోంది. ప్రస్తుతం 3 లక్షల విద్యార్థి వీసాలను బ్రిటన్ మంజూరు చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం వీటి సంఖ్యను దాదాపు సగానికి అంటే 1.7 లక్షలకు తగ్గించనుంది. బ్రిటన్‌లోకి వలసలను తగ్గించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మంది భారతీయ విద్యార్థులకు బ్రిటన్ చిన్న చిన్న కారణాలతో వీసాలను నిరాకరిస్తోంది.
ప్రభుత్వ గణాంకాల కార్యాలయం సర్వే ప్రకారం గతేడాది 1.34 లక్షల మందికి విద్యార్థి వీసాలను మంజూరు చేయగా ఈ ఏడాది 1.11 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. బ్రిటన్ విద్యార్థి వీసాలను అత్యధికంగా దక్కించకుంటున్న తొలి మూడు దేశాలు అమెరికా, చైనా, భారత్. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల పాత్ర ఎంతో ఉందనీ, వారి వల్ల ఏడాదికి 14 బిలియన్ పౌండ్లు సమకూరుతున్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి వలసలను తగ్గించడానికి ఇతర వీసాల సంఖ్యలో కోత పెట్టినా విద్యార్థి వీసాలను మాత్రం ఎక్కువగా ఇవ్వాలని సూచిస్తున్నారు.