వంద పడకల ఆస్పత్రి జీవోకు కృషి చేస్తా
చంద్రగిరి: చంద్రగిరిలోని ఏరియా ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా మార్చేందుకు అవసరమైన జీవో తీసుకురావడానికి కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏరియా ఆస్పత్రి చైర్మన్ హోదాలో బోర్డు కమిటీ సభ్యులను నియమించారు.
ఈ కమిటీలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి సభ్యులుగా చంద్రగిరి ఎంపీపీ, తిరుపతి రూరల్ ఎంపీపీ, పాకాల ఎంపీపీ, చంద్రగిరి జెడ్పీటీసీ, ఆర్‌సీ. పురం జెడ్పీటీసీ, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ, చంద్రగిరి సర్పంచ్, తహశీల్దార్, వైద్యాధికారి, డీసీహెచ్‌ఎస్, మానవ హక్కుల సభ్యులు ఒకరు, స్థానిక సేవ సభ్యులు ఒకరిని నియమించారు. అలాగే చిన్నగొట్టిగల్లు ఏరియా ఆస్పత్రి కమిటీ సభ్యులుగా చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం, రామచంద్రాపురం, ఎంపీపీలు, చిన్నగొట్టిగళ్లు, యర్రావారిపాళెం, పాకాల జెడ్పీటీసీలు, వైధ్యాధికారి, స్థానిక సర్పంచ్, తహశీల్దార్, డీసీహెచ్‌ఎస్, ఐకేపీ, సేవా సంఘం తరఫున ఒకరిని నియమించారు.
అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ నియమించిన బోర్డు సభ్యుల పర్యవేక్షణలో అస్పత్రి వర్గాలు పనిచేస్తాయన్నారు. నియోజకవర్గానికి ఎంతో తలమానికంగా చంద్రగిరి ఆస్పత్రి ఉందన్నారు. 31 మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉందని అయితే ఇద్దరు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఏరియా అస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా జీవో తీసుకురావాలని అధికారులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్రస్తావించానన్నారు.
ముఖ్యంగా 100 పడకల జీవోకు ప్రభుత్వం ఆమోదం తెలిపాలని కోరానన్నారు. దీనికి ప్రభుత్వం, సంబంధిత మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యం అందంచగలిగే విధంగా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎంఎల్‌ఏ జిల్లా వైద్యాధికారితో ఫోన్‌తో మాట్లాడి చంద్రగిరి ఏఎన్‌ఎం నర్సులను కొనసాగించాలని తెలిపారు.
ఎంపీపీ కుసుమ, వైఎస్ ఎంపీపీ వనజ, మండల కన్వీనర్, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ, వేణుగోపాల్‌రెడ్డి, హేమేంద్రకుమార్‌రెడ్డి, ఎంపీటీసీలు బుజ్జి, నవనీతమ్మ, భారతి, జ్యోతి, నాగరాజు, మంగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి, సర్పంచి ఉమామహేశ్వరి, తొండవాడ సర్పంచ్ సిద్దముని, నాయకులు అగరాల భాస్కర్‌రెడ్డి, బండారు హేమచంద్ర, ఒంటి శివశంకర్, కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, మణి, ఫరూక్, జయకుమారి, అస్పత్రి సూపరింటెండెంట్ కె.శారద, డాక్టర్లు పద్మజ, ఆపర్ణ, దినే్‌ష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.