- మదనపల్లె ఏరియా ఆస్పత్రి వైద్యులపై డీసీహెచ్‌ఎన్ మండిపాటు
మదనపల్లెక్రైం: ‘ఓ ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే వైద్యులు ఓ విధి, విధానం లేకుండా వ్యవరించడం తగదు. తమకు కేటాయించిన ఓపీడీలోని రోగులను మాత్రమే పరీక్షించి, పక్క ఓపీడీకి చెందిన వారు వస్తే నాకు సంబంధం లేదు.. మరోచోటుకు వెళ్లమని కసురుకోవడం వైద్యవృత్తికే కళంకం తెస్తుంది. కొంతమంది డాక్టర్లు గిరగీసుకుని వైద్యం చేయడం ఏంటి?. అత్యవసర విభాగంలో డ్యూటీచేసే వారు రోగులు లేనప్పుడు జనరల్ కేసులను కూడా చూడాలి’ అంటూ జిల్లా వైద్యశాలల సంమన్వయకర్త(డీసీహెచ్‌ఎన్) డాక్టర్ సరళమ్మ మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులపై విరుచుకుపడ్డారు.
గురువారం ఆమె ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక డాక్టర్లు, సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలు కాకముందే కొంత మంది డాక్టర్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారని, ఆస్పత్రిలో ఎవరు డాక్టర్లు, ఎవరు సిబ్బంది.. ఎవరు బయటి వ్యక్తులనే తేడా తెలియడంలేదన్నారు. డాక్టర్లు యూనిఫామ్, గుర్తింపు కార్డులు వేసుకోవాలన్నారు.
అత్యవసర విభాగం నుంచి ఎక్స్‌రే, ల్యాబ్, ఫార్మసీ, డ్రగ్‌స్టోర్‌రూము, వార్డులను ఆమె పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్‌థియేటర్‌లో కొన్ని మార్పులను సూచించారు. ఆప్తాలమిక్ కేసులకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. విధులకు హాజరయ్యే డాక్టర్లు ఓ పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నట్లు తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని, దీనికి నేను చాలాషేమ్‌గా ఫీలవుతున్నానని అన్నారు.
ఆస్పత్రిలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తాము చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం తగదన్నారు. పనులు చేయలేని వారు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. ఆదివారాల్లో ఓపీడీ లేకపోయినా వైద్యులు విధిగా ఆస్పత్రికి వచ్చి వార్డుల్లో ఉన్న తమ పేషంట్లను చూడాలన్నారు. డాక్టర్లు లీవు తీసుకుని మాత్రమే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆర్‌ఎంవోనే పూర్తి బాధ్యతలు తీసుకుని ఆస్పత్రిని ప్రక్షాళన చేయాలన్నారు. మాట వినని వారిపై వేటు వేయాలని, దిక్కరిస్తే తనకు సరెండర్ చేయాలని సూచించారు. రోగులకు మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు.
జిల్లాలో 27 వైద్య పోస్టులు ఖాళీ
జిల్లావ్యాప్తంగా 27 వైద్య పోస్టులు కొరత ఉన్నట్టు డీసీహెచ్‌ఎన్ డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ పోస్టుల భర్తీకి సీఏఎస్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడగానే పోస్టులభర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మదనపల్లె ఏరియా ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేక పలుకేసులను రెఫర్ చేస్తున్నారని విలేకర్లు ప్రశ్నించగా వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమా వేశంలో ఆర్‌ఎంవో గురుస్వామినాయక్, డాక్టర్ జ్ఞానేశ్వర్, హెడ్ నర్సులు, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.