పద్ధతి మార్చుకోండి | must change attitude: minister harishrao | Sakshi
Sakshi News home page

పద్ధతి మార్చుకోండి

Published Sun, Aug 21 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

సూపరిండెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రి

సూపరిండెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రి

  • రోగులకు మెరుగైన వైద్యం అందించండి
  • నిజాయితీగా పనిచేయండి.. లేదంటే చర్యలు తప్పవు
  •  ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
  • ఆధునిక పరికరాలు నిరుపయోగంగా ఉండటంపై మండిపాటు
  • సిద్దిపేట జోన్‌: మెరుగైన వైద్యం కోసం కోట్లు ఖర్చు పెట్టినా వైద్యుల్లో మార్పు రాకపోవడం బాధకరంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.  కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి పరిశీలించారు. 

    సెమిఆటో ఎనలైజర్‌ పరికరం నిరుపయోగంగా ఉండడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదని బదులివ్వాలని అక్కడే ఉన్న సూపరింటెండెంట్‌ శివరాంను ప్రశ్నించారు. డాక్టర్‌ శివరాం బదులిస్తూ ఆర్డీఓ సమస్య, నోట్‌ఫైల్‌ సమస్య అంటూ ఎదో చెప్పబోయాడు.

    వెంటనే మంత్రి అందుకోని ఆర్డీఓ పట్టణంలోనే ఉన్నప్పటికీ, రెండు లైన్ల నోట్‌ఫైల్‌ను తయారు చేయక మూడు నెలలుగా విలువైన పరికరాన్ని నిరుపయోగంగా ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కష్టపడి అధునిక వసతులు కల్పిస్తే..మీరు చేసే నిర్వాకం వల్ల వినియోగంలోకి రాకపోవడం బాధాకరమన్నారు.

    ఐదు నెలల్లో 6 కోట్లతో ఆధునిక పరికరాలను సమకూర్చామన్నారు. మీలో మార్పు రాకపోతే ప్రజలకు వైద్యం అందడం కష్టమన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధులు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది, వసతులు  పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని పర్యవేక్షించే తీరిక లేకపోవడం సమంజసం కాదన్నారు.

    ఒక దశలో సూపరింటెండెంట్‌ వేతనం గూర్చి తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ ఉద్యోగిగా, వైద్యునిగా తీసుకున్న జీతానికి సార్థకత చేయాలన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలను తీసుకుంటానని హెచ్చరిస్తూ అక్కడే ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాం అధికారి జగన్‌నాథ్‌రెడ్డిని ఆదేశించారు.  

    13 మంది  ఉన్నప్పటికీ బయటికా...?
    సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, ఎంసీహెచ్‌ ఆసుపత్రుల్లో 13 మంది ల్యాబ్‌ టెక్నిషియన్లు ఉన్నప్పటికీ వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపడం ఆశ్చర్యకరంగా ఉందని మంత్రి అన్నారు. బ్లడ్‌బ్యాంక్‌ పనితీరుపై జిల్లా రెడ్‌క్రాస్‌ సోసైటీ సెక్రటరీ వనజారెడ్డి, జిల్లా డీపీఓ జగన్‌నాథరెడ్డి, బ్లడ్‌బ్యాంక్‌ ఇన్‌చార్జి రామ్మోహన్‌తో వివరాలు సేకరించారు.

    పలుసార్లు పరీక్ష కోసం బయటకు చిట్టీలు రాస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే ఏరియా  ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో టెక్నిషియన్లుగా పనిచేస్తున్న వారిలో కొందరిని ఏరియా  ఆసుపత్రికి, ఎంసీహెచ్‌కు సేవల కోసం కేటాయించాలని వైద్యాధికారులను అదేశించారు. 

    ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం కోట్లు ఖర్చు చేస్తే వైద్యలు, సిబ్బందిలో మార్పురాకపోవడం బాధాకరమన్నారు. త్వరలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తానని వారే ఆసుపత్రుల్లో కూర్చుని సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఆయన వెంట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, హై రిస్కు ఇన్‌చార్జి కాశీనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement