
ఆస్పత్రి బయటే నిండు చూలాలు
పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో అమానవీయ ఘటన
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది.
ప్రాధేయపడ్డా ఫలితం లేదు
అనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.
నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు.