పనిచేయని ఎక్స్‌రే ప్లాంట్
మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో ఏకైక 100 పడకల వైద్యశాలగా ఉన్న మార్కాపురంలోని ఏరియా వైద్యశాలలో గత 10 రోజుల నుంచి ఎక్స్‌రే యూనిట్ చెడిపోయింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా వైద్యశాలకు గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల్లోని రోగుల వైద్యసేవల నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రధానంగా నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని చికిత్స నిమిత్తం కచ్చితంగా ఎక్సరే తీయాలి.
రోజుకు 400 నుంచి 450 మంది వరకు రోగులు ఓపీ విభాగంలో చికిత్స పొందుతారు. వీరిలో ప్రతి రోజూ 60 నుంచి 70 మంది వరకు ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు విరిగిన వారికి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాద బాధితులకు మెడనొప్పి, పంటి నొప్పితో బాధపడుతున్న వారికి చికిత్స చేయాలంటే ఎక్స్‌రే అవసరం. అయితే ఎక్స్‌రే ప్లాంట్ లేకపోవటంతో వైద్యశాలలోని వైద్యులు రోగులకు బయట ఎక్స్‌రే తీయించుకోమని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోగులకు ఆర్థిక భారం తప్పటం లేదు. కొన్ని రకాల చికిత్సలకు కచ్చితంగా ఎక్స్‌రే ఆధారంగానే ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రోగులు 150 నుంచి 200 రూపాయలు చెల్లించి బయట తీయించుకుంటున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం: వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎక్స్‌రే ప్లాంట్ చెడిపోయిన విషయాన్ని వైద్య విధాన పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో బాగు చేయించి రోగులకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం.- చక్కా మాలకొండ నరసింహారావు
Comments
Please login to add a commentAdd a comment