సౌకర్యాల స్థాయి పెరగలేదు! | VIP Reporter With RAJAM mla Kambala Jogulu | Sakshi
Sakshi News home page

సౌకర్యాల స్థాయి పెరగలేదు!

Published Sun, Feb 1 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

సౌకర్యాల స్థాయి పెరగలేదు!

సౌకర్యాల స్థాయి పెరగలేదు!

 పేదల వైద్యానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సమన్వయం, పర్యవేక్షణ లోపంతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి రాజాం ఏరియా ఆస్పత్రి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆస్పత్రిని 60 పడకల నుంచి 100 పడకల స్థాయికి రెండేళ్ల క్రితం మార్చారు. సుమారు రూ.4 కోట్లు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించారు. అయితే వైద్య పరీక్షలు, చికిత్సలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చడంలో మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థాయి పెరిగినా.. ఆ స్థాయి వైద్యసేవలు అందక పేద రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పెద్ద జబ్బులు చేస్తే వేరే ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది.
 
 కొన్ని సందర్భాల్లో సకాలంలో మెరుగైన చికిత్స అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకు రాజాం ఎమ్మెల్యేల కంబాల జోగులు ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. వైద్యాధికారులను, ఇతర సిబ్బందితో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్యసేవలు, అవసరాలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి తన స్థాయిలో ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. వివిధ వర్గాలవారితో ఆయన జరిపిన సంభాషణ యథాతథంగా..
 
 రోగులతో..
 ఎమ్మెల్యే జోగులు(గైనిక్ వార్డులో): మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆపరేషన్ చేశారా లేక సాధరణ డెలివరీయా? ఎంత ఖర్చు అయింది? స్టాఫ్‌కు డబ్బులు ఏమైనా ఇచ్చారా?
 మడ్డు దుర్గ(రోగి): రాజాం మండలం బొద్దాం నుంచి జనవరి 29న వచ్చి జాయిన్ అయ్యాను. సాధారణ డెలివరీ చేశారు. రూ.200 ఖర్చు అయ్యింది. స్టాఫ్ ఎవరూ డబ్బులు అడగలేదు.
 ఎమ్మెల్యే : మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి? ఆస్పత్రి పనితీరుపై మీ అభిప్రాయమేంటి?
 ముగడ నరిశింహులు(రోగి సహాయకుడు) : నా పేరు ముగడ నరిశింహులు. సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామం. పేషెంట్‌తో వచ్చా. జ్వరం, జలుబు, ఒళ్లుపీకులు ఉన్నాయని డాక్టర్‌కు చెప్పాం. మందులు ఇచ్చారు. గవర్నెమెంట్ మందులు కావడం వల్ల తగ్గడం లేదని చెప్పాం. మరి అవే ఉన్నాయని డాక్టర్
 చెప్పారు. బయట మందులు కొనలేం. ఏం చేయాలో తోచడం లేదు.
 ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏంటి ప్రాబ్లమ్? ఎప్పుడు జాయిన్ అయ్యావ్? బాత్‌రూంలు బాగున్నాయా? నీటి సౌకర్యం ఉందా?
 జి.అప్పలనరసమ్మ(రోగి): విరేచనాలు, కడుపునొప్పితో వచ్చి జాయిన్ అయ్యాను. బాతరూంలు కంపు కొడుతున్నాయి. నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. తాగునీరు కూడా లేక ఇబ్బంది పడుతున్నాం.
 ఎమ్మెల్యే: ఏమయ్యా.. ఏం జరిగింది? కాలుకి ఎలా దెబ్బ తగిలింది? వైద్యులు ఏమన్నారు? మందులు ఇస్తున్నారా?
 గురవాన లక్షుం(రోగి): పొలంలో కాలు జారి పడ్డాను. ఎముక విరిగింది. వైద్యులకు చూపిస్తే కట్టు కట్టారు. మందులు ఇస్తున్నారు. పరవాలేదనిపిస్తోంది. ఆపరేషన్ చేయడానికి షుగర్ ఉందన్నారు.
 ఎమ్మెల్యే: ఆస్పత్రిలో జాయిన్ అయ్యావు, ఏమైంది బాబూ? ఏంటి నీ సమస్య?
 నాగళ్ల దుర్గారావు(రోగి): కడుపు నొప్పితో జాయిన్ అయ్యాను. మందులు ఇచ్చారు. గ్యాస్ట్రిక్ ఉందని చెప్పారు. ఇప్పుడు బాగుంది.
 సూపరింటెండెంట్‌తో..
 ఎమ్మెల్యే: ఆపరేషన్లు ఎందుకు చేయటం లేదు? అవసరమైతే ఎలా మరీ?
 గార రవిప్రసాద్(సూపరింటెండెంట్): ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడు ఉన్నారు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగులేకపోవడటంతో విధులకు హాజరుకావడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇంకా రెస్పాండ్ కాలేదు.
 ఎమ్మెల్యే: ఓపీ, ఇతర వైద్య సేవలకు ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఎంతమంది అవసరం?
 రవిప్రసాద్: ప్రతి రోజూ ఓపీకి 350 నుంచి 400 కేసులు వస్తాయి. ఐపీకి మరో 30 వరకు ఉంటాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 8 మంది వైద్యులు పనిచేస్తున్నారు. జనరల్ మెడిసన్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, ఎముకలు, మానసిక వైద్య నిపుణులు సాయిరాం, డెంటిస్టు, అనస్థసిస్ట్ ఉన్నారు. మరో ఆరుగురు వైద్యులు అవసరం.
 ఎమ్మెల్యే: కనీస అవసరాలకు కావల్సిన సిబ్బంది ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఏఏ సమస్యలు ఉన్నాయి?
 రవిప్రసాద్: బెడ్‌షీట్లు ఉతకడానికి దోబీ లేడు. పోస్టు మంజూరు చేయాలని ఉన్నతాధికారులను కోరినా స్పందించడం లేదు. దీంతో మంచాలపై బెడ్‌షీట్లు వేయలేకపోతున్నాం. ఎలక్ట్రీషియన్ లేడు. కరెంటు సమస్యలు ఎదుర్కొంటున్నాం. సొంత డబ్బులు పెట్టి ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నాం. చాలా కష్టంగా ఉంది.
 ఎమ్మెల్యే: ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలుతోంది కదా.. దాని నివారణకు ఏమైనా సౌకర్యాలు కల్పించారా? కేసులు ఏమైనా నమోదు అయ్యాయా? ప్రత్యేక నిధులు ఏమైనా మంజూరు అయ్యాయా?
 రవిప్రసాద్: స్వైన్‌ఫ్లూ లక్షణాలు కలిగిన రోగులు ఇంతవరకు రాలేదు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సౌకర్యాలు ఏమీ కల్పించలేదు. నిధులు కూడా మంజూరు కాలేదు. ఇక్కడికి వచ్చే రోగుల్లో అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రిమ్స్‌కు తరలిస్తాం.
 ఎమ్మెల్యే: ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదు కదా!.. ఎలా మేనేజ్ చేస్తున్నారు?
 రవిప్రసాద్: ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అవసరమైతే హెచ్‌డీఎఫ్‌సీ నిధులు ఖర్చు చేయమని చెప్పారు. కానీ ఇంతవరకూ కమిటీ ఏర్పాటు కాలేదు. మీటింగ్ కూడా జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో సొంత డబ్బులు నెలకు సుమారు రూ. 15వేల వరకు ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో సగం మంది ఈ ప్రాంతం వారమే కాబట్టి.. సొంత ఊరిపై మమకారంతో ఆస్పత్రి నిర్వహణకు అయ్యే ఖర్చు భరిస్తున్నాం.
 చిన్నపిల్లల వైద్యనిపుణుడితో..
 ఎమ్మెల్యే: చిన్న పిల్లల ఓపీ ఎంత ఉంటుంది? మందులు పూర్తి స్థాయిలో ఉన్నాయా?
 కరణం హరిబాబు(చిన్నపిల్లల వైద్యనిపుణుడు): ప్రతి రోజూ ఓపీ 50 నుంచి 60 వరకు ఉంటుంది. కొన్ని మందులు ఆస్పత్రిలోనే లభిస్తాయి. మరికొన్ని బయట మందులు షాపుల్లో దొరుకుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటి మందులు రాస్తాం.
 నర్సులతో..
 ఎమ్మెల్యే: ఆస్పత్రిలో దుర్వాసన వస్తోంది. రోగులు ఉండలేక పోతున్నామంటున్నారు. పారిశుధ్ధ్య సిబ్బంది పనులు చేయటం లేదా? కాంట్రాక్టర్ రావటం లేదా?
 సోఫియా(హెడ్ నర్సు): దోబీ లేకపోవటంతో బెడ్‌షీట్లు ఉతకటం కుదరడం లేదు. దీంతో మంచాలపై బెడ్‌షీట్లు వేయటం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం రావటం లేదు. సూపర్‌వైజరే అన్నీ చూస్తున్నారు. గదులు శుభ్రంగా ఉంచుతున్నాం.
 ఎమ్మెల్యే: ఏమమ్మా.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందా? పని విషయంలో భద్రత దొరుకుతుందా?
 విజయలక్ష్మి(స్టాఫ్ నర్స్): పదో పీఆర్‌సీ అమలు చేయటం లేదు. పనిలో భద్రత దొరకడం లేదు. పనికి తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. పని పెరిగింది. సిబ్బంది తక్కువగా ఉన్నారు. మరో 14 మంది స్టాఫ్ నర్సులను నియమించాల్సి ఉంది.
 ఎమ్మెల్యే(ముక్తాయింపు): మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.. పరిష్కారానికి చొరవ చూపుతా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement