మృతి చెందిన ఆడ శిశువు
వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు
మహబూబాబాద్ రూరల్ : మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆడ శిశువు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. శిశువు తండ్రి బోడ వీరన్న, అమ్మమ్మ జ్యోతి కథనం ప్రకారం.. గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి శివారు జంగుతండాకు చెందిన వీరన్న తన భార్య సోనియాకు నొప్పులు రావడంతో మానుకోట ఏరియా ఆస్పత్రికి ఈనెల 16వ తేదీన తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్ లేరని చెప్పడంతో సోనియాను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు పేదవారు కావడంతో డబ్బులు లేక మళ్లీ ఏరియా ఆస్పత్రికి సోనియాను తీసుకొచ్చారు.
కాగా వైద్యురాలు మాలతీరెడ్డి సోనియాకు పరీక్షించిన అనంతరం డెలివరీకి ఇంకా నెల రోజులు సమయం ఉందని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు వెంటనే ఆపరేషన్ చేయాలని తమకు చెప్పారని సోనియా తల్లి జ్యోతి వైద్యురాలు మాలతిరెడ్డికి చెప్పారు. అనంతరం వారు తమ తండాకు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మళ్లీ నొప్పులు పెరగడంతో ఆటోలో సోనియాను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆమెను సిబ్బంది పట్టించుకోలేదు.
వైద్యురాలు మాలతిరెడ్డి వచ్చాక సాయంత్రం 5.30 గంటలకు సోనియాకు ఆపరేషన్ చేసి పుట్టిన ఆడ శిశువును ఎస్‌ఎన్‌సీయూలో పెట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎస్‌ఎన్‌సీయూ సిబ్బంది పాలు పట్టించమని శిశువును తల్లి వద్దకు పంపించారు. కాగా ఆ శిశువుకు పాలు తాగకపోవడంతో వెళ్లి ఆస్పత్రి సిబ్బందికి పరిస్థితిని వివరించగా పాపకు బాగోలేదని, ఆక్సిజన్ పెట్టారు. ఆ వెంటనే పాప మృతి చెందిందని చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటికీ సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతోనే తమకు అన్యాయం జరిగిందని శిశువు తండ్రి బోడ వీరన్న, అమ్మమ్మ జ్యోతి అన్నారు. తమ పాప మృతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వైద్యురాలు మాలతిరెడ్డిపె చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.