ట్రాక్టర్ కింద నలిగిన చిన్నారి
♦ అన్నారంలో దుర్ఘటన
♦ తల్లడిల్లిన తల్లిదండ్రులు
జిన్నారం: ఇంటిముందు ఆడుకుంటూ ఉన్న ఓ చిన్నారి అంతలోనే మత్యువాత పడింది. ట్రాక్టర్ కింద నలిగిపోవడంతో ప్రాణాలు విడిచింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు బోరుమన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి జిన్నారం మండలం అన్నారంలో చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం...
నర్సాపూర్ మండలం తున్కి గ్రామానికి చెందిన సలీంఖాన్ కుటుంబం కొన్నేళ్లుగా జిన్నారం మండలం అన్నారం గ్రామానికి వలస వచ్చింది. కూలీపని చేసుకుంటూ సలీంఖాన్ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. సలీంఖాన్ రెండో కూతురు ఐనాజ్బేగం(7) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. రాత్రి సమయంలో ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ వెనక్కు తీసుకుంటుండగా, అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపైకి ట్రాక్టర్ వెళ్లింది. ఐనాజ్బేగం తలపై భాగం నుంచి ట్రాక్టర్ వెనక టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.
పోలీసులు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తండ్రి సలీంఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ లాలూనాయక్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.