వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి | Young Man Died In Area Hospital With Doctors Neglect | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి

Published Mon, Apr 2 2018 11:59 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Young Man Died In Area Hospital With Doctors Neglect - Sakshi

బాధితులతో మాట్లాడుతున్న ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు , తిరుపతిరావు(ఫైల్‌)

టెక్కలి/టెక్కలిరూరల్‌: డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో.. మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రంలో 110 పడకల ఏరియా ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందజేయడంతోనే స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన యువకుడు సంకిలి తిరుపతిరావు(27) మృతిచెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. తిరుపతిరావుకు కడుపునొప్పి, తలనొప్పి రావడంతో భార్య పుష్పతో పాటు స్థానికులు ఆయనని శనివారం టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు జ్యోతి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో, శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. ‘108’లో రిమ్స్‌కు తరలించగా, తిరుపతిరావు మృతిచెందారు. టెక్కలి ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలు జ్యోతి సక్రమంగా వైద్యసాయం అందజేయలేదని, మరో వైద్యుడు లక్ష్మణరావుకు సమాచారమిచ్చినా స్పందించలేదని మృతుని కుటుంబసభ్యులతో పాటు వీధి ప్రజలంతా అర్ధరాత్రి ఒంటి గంట సమయం నుంచి 2 గంటల వరకు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని వారిని వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వీరు.. ఆదివారం ఉదయం మళ్లీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

లోపలికి ప్రవేశించి వైద్యురాలు జ్యోతిని నిలదీస్తూ ఫర్నీచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం గేటు వద్ద బైఠాయించి జ్యోతి, సూపరింటెండెంట్‌ కె.కేశవరావుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు తమ్మన్నగారి కిరణ్, యు.శంకర్, శ్యామలరావు, వార్డు సభ్యుడు దోని బుజ్జి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుపతిరావు కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థికసాయంతో పాటు ఆయన పిల్లలకు వసతి గృహంలో సీట్లు వచ్చేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై వైఎస్సార్‌ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్‌ ఆరా తీశారు. వైద్యురాలు జ్యోతి మాట్లాడుతూ తిరుపతిరావును అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్యం అందించాక పరిస్థితి విషమించిందని తెలిపారు. టెక్కలి సీఐ కె.భవానీప్రసాద్, పలాస సీఐ తాతారావు, ఎస్‌ఐ లు సురేష్‌బాబు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement