కంటి ఆపరేషన్లు బంద్
-
10 రోజులుగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు
-
పట్టించుకోని అధికారులు
కంటి ఆపరేషన్లకు అవసరమైన బీఎస్‌ఎస్ (బయలాజిక్ సాల్ట్ సొల్యూషన్) లేకపోవడంతో శస్త్రచికిత్సలు బంద్ అయ్యాయి. 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, ప్రతి రోజూ ఆసుపత్రికి వచ్చి, ఆ మందు రాలేదని తెలుసుకుని తిరిగి ఇళ్లకు వెళుతున్నారు.
గూడూరు:
గూడూరు ఏరియా ఆసుపత్రిలో నేత్ర వైద్యనిపుణులుగా పనిచేసే వైద్యులు గోపీనాథ్ శస్త్రచికిత్సల్లో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఆపరేషన్ల కోసం గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, కోట, వాకాడు తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆసుపత్రిలో 10 రోజులుగా ఆపరేషన్‌కు అవసరమైన బీఎస్‌ఎస్ లేకపోవడంతో ఆపరేషన్‌లు నిలిచిపోయాయి. దీంతో ఆపరేషన్ల కోసం వచ్చిన వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బీఎస్‌ఎస్ తెప్పించాల్సిన ఆసుపత్రి అదికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యులు చెపుతున్నారు. ఈ మేరకు డీపీఎంతో మాట్లాడం జరిగిందని, ఆమె కూడా పలు పర్యాయాలు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసినా వారు పంపలేదని, ఈ మందును బయట నుంచి తెప్పించకూడదని ఆమె చెపుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారుల స్పందించి బాగా ఆపరేషన్‌లు చేసే గూడూరు ఏరియా ఆసుపత్రి వైద్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన మందు సామగ్రిని సరఫరా చేయాలని కూడా కోరుతున్నారు.
వాళ్లను తిప్పుకుంటుంటే బాధగా ఉంది : గోపీనాద్. నేత్ర వైద్యులు
బీఎస్‌ఎస్ లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోయాయి. అది ఎప్పుడొస్తుందో తెలీదు. దీంతో రోజూ వాళ్లు వస్తుంటే ఆ మందు రాకపోవడంతో వాళ్లను తిప్పాల్సి వస్తోంది.
ఎన్ని సార్లు తిరగాలి : రమణయ్య, దగ్గవోలు
ఆపరేషన్ కోసం రెండు సార్లు వచ్చాం. వస్తే ఆ మందు ఇంకా రాలేదు అంటున్నారు. ఎన్ని సార్లు తిరగగలం. అధికారులు సమస్యను పరిష్కరించాలి.