బెల్లంపల్లి సింగరేణి ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో నృత్యాలు చేస్తున్న వైద్యులు
బెల్లంపల్లి: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొందరు వైద్యులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఏకంగా ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరీ చిందులేశారు. వివరాలు.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని కరోనా వైరస్ అనుమానితులను అబ్జర్వేషన్‌లో ఉంచడానికి ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఏరియా ఆస్పత్రి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ వ్యవహారాన్ని కొందరు సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
మనస్పర్ధలే కారణమా?: సింగరేణి ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నృత్యాలు చేసిన విషయాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగానే సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక కుట్ర దాగి ఉన్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. ఇటీవల నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో కేక్ కట్ చేయడానికి ఓ ప్రజా ప్రతినిధి వెళ్లినట్లు సమాచారం. ఐసోలేషన్ వార్డు ఏర్పా టు చేసినందువల్ల వేడుకలు నిర్వహించరాదని ఓ వైద్యుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి నర్సుల వేడుకల్లో పాల్గొనకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. దీన్ని కొందరు సిబ్బంది అవమానకరంగా భావించడంతోనే వైద్యులు, సిబ్బందిలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment