‘మండలి’ సేవలు మరువలేనివి
- సంస్మరణ సభలో వక్తల ఉద్ఘాటన
- ఘనంగా మండలి వెంకటకృష్ణారావు జయంతి
- నేతలు, అభిమానుల నివాళి
అవనిగడ్డ : దివంగత ప్రజానాయకుడు మండలి వెంకటకృష్ణారావు దివిసీమ అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని కేంద్ర సాహిత్య అకాడ మీ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు 88వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీక్షేత్రంలో సోమవారం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యార్లగడ్డ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ప్రభావితులైన వెంకటకృష్ణారావు 1969లో అవనిగడ్డలో గాంధీక్షేత్రాన్ని ఏర్పాటుచేసి ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారన్నారు.
నేటి తరం నాయకులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. మరో ముఖ్యఅతిథి, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వెంకటకృష్ణారావు జీవితాంతం సమాజసేవే పరమావధిగా భావించారని పేర్కొన్నారు. 1977 నవంబరు 19న సంభవించిన ఉప్పెనకు మరుభూమిగా మారిన దివిసీమను ప్రపంచ దేశాల్లోని స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో దివ్యసీమగా మార్చిన ఘనత మండలి వెంకటకృష్ణారావుకే దక్కుతుందన్నారు.
1975లో ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ద్వారా తెలుగుభాషా వికాసానికి ఎంతో కృషి చేశారన్నారు. సభలో ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి ఎంపీపీలు బండె నాగ వెంకటకనకదుర్గ, యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, మోర్ల జయలక్ష్మి, అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు (బుల్కి), డీసీఎంఎస్ డెరైక్టర్ మురాల సుబ్బారావు, అన్నపరెడ్డి సత్యనారాయణ, రెడ్‌క్రాస్‌సొసైటీ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఇళ్లా రవి, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వీడీఆర్ కుమార్, చల్లపల్లి రోటరీక్లబ్ మాజీ అధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా) తదితరులు మాట్లాడుతూ వెంకట కృష్ణారావు సేవలను ప్రస్తుతించారు.
తొలుత అవనిగడ్డ వంతెన సెంటరులోని మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం సేవాశ్రమంలో ఉన్న మండలి వెంకటకృష్ణారావు సమాధి వద్ద అంజలి ఘటించారు.
రక్తదాన శిబిరానికి విశేషస్పందన
మండలి జయంతిని పురస్కరించుకుని పట్టాభి రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రారంభించగా 205మంది రక్తదానం చేశారు. దాతలను నాయకులు అభినందించారు.
710మందికి కంటి వైద్యం
గాంధీక్షేత్రంలో నిర్వహించిన ఉచిత మెగా నేత్రవైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దివిసీమ పరిసర ప్రాంతాల నుంచి 710మంది పరీక్షలు చేయించుకున్నారు. 195మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఎంపికచేయగా మరో 200 మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు.