వైద్యసేవలపై ఫోన్‌లో వైద్యులను నిలదీస్తున్న క్షతగాత్రుడి బంధువు ,108 వాహనం కోసం ఆటోలో ఎదురుచూస్తున్న క్షతగాత్రులు
పెద్దాపురం: ‘‘ఇవెక్కడి వైద్యసేవలు.. మంత్రి గారేమో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరిచాం అంటారు.. ఇక్కడ చూస్తే వైద్యులు అందుబాటులో ఉండరు.. కనీసం పట్టించుకునే వారే కనిపించరు. ఇలాగేనా సేవలందించేంది’’ అంటూ పలువురు హోంమంత్రి నియోజకవర్గంలోని పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు ప్రయాణికులతో వెళుతున్న ఆటోను పెద్దాపురం జి.రాగంపేట గ్రామంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పంక్చరై అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
వీరిలో పెద్దాపురానికి చుందిన అడబాల వీర సత్యవేణి, ముక్కొల్లుకు చెందిన భార్యభర్తలు పద్మరాజు, సీతాయ్యమ్మ , రాయవరం మండలం వెదురుపాకకు చెందిన పెదిరెడ్డి కామేశ్వరరావు, పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన సీకోటి అప్పలరాజు, సామర్లకోటకు చెందిన సీహెచ్ ప్రభావతిలకు తీవ్ర గాయాలు కాగా, విరవకు చెందిన సీకోటి అప్పారావు, మరో ఇరువురుకి స్పల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో వారి బంధువులు తీవ్ర నిరసనకు దిగారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్యులు రవికాంత్‌కు ఫోన్‌చేసి.. ‘‘ఇదెక్కడి వైద్యసేవలు.. మంత్రి గారేమో ఆసుపత్రి వైద్య సేవలు మెరుగుపరిచాం అంటారు.. ఇలాగేనా సేవలందేది? అంటూ వైద్యులపై మండిపడ్డారు. దీంతో ఆయన అందుబాటులో అతిరాత్రం వద్ద ఉన్న వైద్యురాలు సుదీప్తిని ఆసుపత్రికి పంపించగా ఆమె ప్రాథమిక చికిత్స చేసి అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సిబ్బంది అందుబాటులో లేక..
క్షతగాత్రులను తరలించేందుకు ఆసుపత్రిలో సరైన వాహనం అందుబాటులో లేక పోవడంతో సుమారు మూడు గంటలకు పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. అనంతరం వచ్చిన 108లో తమ పేషెంట్‌ను తీసుకువెళ్ళాలంటూ 108 సిబ్బందిపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108లో ఇద్దరిని మాత్రమే తీసుకువెళ్లే వీలుందని సిబ్బంది చెబుతున్నా ఇరు వర్గాలవారు మొండిగా వ్యవహరించడంతో అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది సముదాయించి తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని ముందుగా కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment