తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి.
తణుకు అర్బన్: తణుకు ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న ప్రైవేటు వైద్య పరీక్షల సంస్థ మెడాల్ వారం రోజులుగా మూతపడింది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగులు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఆస్పత్రిలోని ల్యాబ్ కొన్ని పరీక్షలకే పరిమితం చేసి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మెడాల్ సంస్థచే 48 రకాల ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాని సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేతనాల బకాయిలు అందకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. థైరాయిడ్, ప్లేట్‌లెట్స్ కౌంట్, లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, క్యాన్సర్ నిర్ధారణ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్న ఈ సేవలు నిలిచిపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
మూడు నెలలుగా వేతనాల్లేవ్
మెడాల్ సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ వైద్యపరీక్షలను నిలిపివేసింది. తమకు రావాల్సిన మొత్తాన్ని మెడాల్ సంస్థ చెల్లించలేదని ప్రభుత్వం నుంచి వారికి బిల్లులు రాకపోవడంతో తమకు కూడా నిలిపివేశారని మెడాల్ అనుబంధ సంస్థ అయిన ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు. వైద్యపరీక్షలు చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది కూడా విధులకు హాజరుకావట్లేదని తెలుస్తోంది.
నిత్యం 500 మందికి పైగా..
తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యవర్గాలు అందిస్తున్న నాణ్యమైన వైద్యసేవల కారణంగా ఇటీవల కాలంలో నిత్యం 500కు పైగా రోగులు, గర్భిణులు వైద్యసేవల కోసం వస్తున్నారు. ఇందులో 70 శాతం మందికి వివిధ పరీక్షలు వైద్యులు రాస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు చేయించుకుని తమ జేబులు గుల్లచేసుకుంటున్నామని వాపోతున్నారు.
ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాల్సిందే..
మా నాన్నకు ఆరోగ్యం సరిగాలేదని వైద్యులు కొన్నిరకాల పరీక్షలు చే యించుకోమన్నారు. ఆస్పత్రిలో మెడాల్ వైద్యపరీక్షలు నిలిచిపోవడంతో ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఈ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలి.– బి.సాయి కమార్, తణుకు
వారం రోజులుగా నిలిచిపోయాయి
ఆస్పత్రిలో అందుబాటులో ఉండే మెడాల్ వైద్య పరీక్షలు వారం రోజులుగా నిలిచిపోయాయి. ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నామని చెప్పారు కాని ఇప్పటివరకు విధుల్లోకి రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య పరీక్షలు మాత్రమే బయటికి రాస్తున్నాం.– డాక్టర్ వెలగల అరుణ, తణుకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment