తల్లిదండ్రులకు బాలుణ్ని అప్పగిస్తున్న తణుకు సీఐ చైతన్యకృష్ణ
పశ్చిమగోదావరి, తణుకు : తణుకు పట్టణంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆరేళ్ల బాలుడ్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు తల్లిదండ్రులు తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే తణుకు పట్టణంలోని సోమవారం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అయితే కిడ్నాప్ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తణుకు పట్టణ పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఛేదించారు. తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడు గ్రామంలోని ఒక ఇంట్లో నిందితులు బాలుడ్ని వదిలి వెళ్లినట్లు సమాచారం అందుకున్న పోలీసులు బాలుణ్ని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆర్థిక లావాదేవీలే కారణం
గణపవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తోట పెద్దకాపు ధాన్యం వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో మధ్యవర్తులతో పాటు గ్రామంలోని రైతుల నుంచి సుమారు రూ.2 కోట్ల వరకు ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు అప్పులపాలైన పెద్దకాపునకు ఒత్తిళ్లు పెరిగిపోవడంతో భార్య దుర్గాభవాని, ఇద్దరు పిల్లలతో ఇరవై రోజుల క్రితం ఊరు వదిలి వెళ్లిపోయారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయవాదిని సంప్రదించడానికి తణుకు వచ్చిన పెద్దకాపు రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. సోమవారం ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డులోని న్యాయవాది ఇంటికి భార్య దుర్గాభవాని, కుమారుడు తోట సోమసూర్య శశివర్థన్ (6)లను తోడుకుని పెద్దకాపు వచ్చారు. లోపల తల్లిదండ్రులు న్యాయవాదితో మాట్లాడుతున్న క్రమంలో బాలుడు శశివర్థన్ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ఇదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారుసైకిల్‌పై వచ్చి బాలుడిని అపహరించుకుపోయారు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన తల్లిదండ్రులకు బాలుడు కనిపించకపోవడంలో లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే తమ కుమారుడిని కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ దర్యాప్తు ప్రారంభించారు. సీఐ డీఎస్.చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టిచ్చిన సీసీ కెమెరా
బాలుడి కిడ్నాప్ విషయం దావానంలా వ్యాప్తి చెందడంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డులోని ఒక బియ్యం దుకాణంలో బయట ఉన్న సీసీ కెమెరాలో బాలుణ్ని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని వెళుతున్న దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఆధారంగా అన్ని చెక్‌పోస్టులను అప్రమత్తం చేసిన పోలీసు అధికారులు ఒక పక్క నిందితులు వాడుతున్న సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరికి తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడు గ్రామంలో బాలుడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలుడి ఆచూకీ కనుగొన్నారు. గణపవరం గ్రామానికి చెందిన తన్నీడి విజయకుమార్ అలియాస్ వాసు, మధులను నిందితులుగా పోలీసులు నిర్థారించారు. విజయకుమార్ బంధువుల ఇంట్లో వదిలి నిందితులు పారిపోయినట్లు సీఐ చెప్పారు. బాలుడిని క్షేమంగా తణుకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ వ్యవహారం ఛేదించడంలో సహకరించిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ, పెరవలి, రూరల్ ఎస్సైలు వి.జగదీశ్వరరావు, ఎన్.శ్రీనివాసరావు, పోలీస్ కానిస్టేబుళ్లను సీఐ చైతన్యకృష్ణ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment