‘ఏరియా’.. అదిరెనయా
♦ ఉత్తమ సేవలకు గుర్తింపు
♦ ఈనెల 11న హైదరాబాద్‌లో ప్రదానం
♦ హైరిస్క్’లో టార్గెట్‌కు మించి ప్రసవాలు
మెదక్ : స్థానిక ఏరియా ఆస్పత్రి.. ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మెదక్ ఏరియా ఆస్పత్రితోపాటు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిని రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా ఆస్పత్రులుగా గుర్తించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్లు ఈ నెల 11న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి అధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఏడాదికి 1400 ప్రసవాలు చేయాలనే టార్గెట్ ఉండగా, 2,400 చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
అలాగే నెలకు 10యూనిట్ల రక్తానికి గాను, ప్రస్తుతం నెలకు 60-70 యూనిట్ల రక్తాన్ని వినియోగిస్తున్నారు. హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో ప్రసవాలు రెట్టింపుస్థాయిలో అవుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మెరుగైన సేవలే అందుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఆరు మాసాల క్రితం కొత్త బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ బెడ్‌షీట్స్ రోజుకో కలర్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మెదక్‌లో ప్రథమంగా బెడ్‌షీట్ల మార్పిడిని పెలైట్‌గా ఏర్పాటు చేసి మంచి ఫలితాలను సాధించారు. మూడు నెలల క్రితం ఏరియా ఆస్పత్రిలో రూ.12లక్షలు వెచ్చించి అధునాతన ఎక్స్‌రేలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించారు.
నిరుపేదలకు మెరుగైన సేవలు..
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన సేవలందించేందుకు ఇప్పటికే డయాలసిస్‌తోపాటు ఐసీయూ మంజూరు చేయించాం. 100 నుంచి 250 పడకల ఆస్పత్రిగా, గర్భిణులకు అదనంగా 50 పడకల కోసం ప్రతిపాదనలు పంపాం.
-డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు
ఏడాదిగా మెదక్ ఏరియా ఆస్పత్రిలో నిరుపేదలకు అనేక రకాలుగా సేవలందిస్తున్నాం. ఈ సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా గుర్తించింది. ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. -పి.చంద్రశేఖర్, సూపరింటెండెంట్