ప్రస్తుతం దేశంలో తలసరి నీటి లభ్యత 1,486 క్యూబిక్ మీటర్లు
2031 నాటికి 1,367, 2051కు 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గనున్న నీటి లభ్యత
జనాభా వృద్ధికి అనుగుణంగా నీటి లభ్యత పెరగకపోవడమే కారణం
కేంద్ర జల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: జలసంక్షోభం ముంచుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గుతోంది. మన దేశంలో 1951 నాటికి తలసరి నీటి లభ్యత 5,177 క్యూబిక్ మీటర్లుŠ(ఒక క్యూబిక్ మీటర్‌కు వెయ్యి లీటర్లు) ఉంటే... ప్రస్తుతం అది 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. ఇది 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు... 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి లభ్యత పెరగకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోందని వెల్లడించింది. సముద్రం పాలవుతున్న నదీ జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, భూగర్భ జలాలను సంరక్షించుకోవడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవడం ద్వారా తలసరి నీటి లభ్యతను పెంచుకోవచ్చని సూచించింది.
సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికలో ప్రధాన అంశాలు...
» ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో 97.5 శాతం ఉప్పునీరు. 2.5 శాతం మాత్రమే మంచినీరు. భూమిపై ఉన్న మంచినీటిలో 68.9 శాతం హిమానీనదాలు(గ్లేసియర్లు)లో ఉండగా, భూగర్భజలాలు, భూమిలో తేమ రూపంలో 30.8 శాతం, నదులు, సరస్సులలో 0.3 శాతం ఉంది.
» మన దేశ భౌగోళిక విస్తీర్ణం 328.75 మిలియన్ హెక్టార్లు. ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం వాటా 2.44 శాతం. దేశంలో సగటున ఏటా 1,170 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. వర్షపాతం వల్ల ఏటా 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్లు(బీసీఎం) నీరు లభిస్తుంది. ఇందులో 1,999.2 బీసీఎంల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 1,139.18 బీసీఎంల నీటిని వినియోగించుకుంటున్నాం.
» ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం తలసరి నీటి లభ్యత 5 వేల క్యూబిక్ లీటర్లు ఉండాలి. ఆ ప్రమాణాల మేరకు మన దేశంలో 1951లో మాత్రమే నీటి లభ్యత ఉంది. ఆ తర్వాత క్రమేణా జనాభా పెరుగుతూ ఉండటం, దానికి అనుగుణంగా నీటి లభ్యతను పెంచుకోకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత తగ్గిపోతోంది.
» ఏ దేశంలో అయినా తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్ లీటర్లు ఉంటే... ఆ దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నట్లు. ప్రస్తుతం మన దేశంలో తలసరి నీటి లభ్యత 1,486 క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ లెక్కన మన దేశంలో తీవ్ర నీటి కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2051 నాటికి దేశంలో తీవ్ర జలసంక్షోభం తలెత్తడం ఖాయమని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో ఉప్పు నీరు: 97.5 శాతం
మంచి నీరు: 2.5 శాతం
ప్రపంచంలో భూమిపై ఉన్న మంచినీటి విస్తరణ ఇలా..
హిమానీనదాలలో: 68.9 శాతం
భూగర్భజలాలు, భూమిలో
తేమ రూపంలో: 30.8 శాతం
నదులు, సరస్సులలో: 0.3 శాతం
Comments
Please login to add a commentAdd a comment