
సాక్షి, హైదరాబాద్ : గిరిజన విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి నింపేందుకు గిరిజన సంక్షేమ శాఖ క్రీడా గురుకులాలను అందుబాటులోకి తెస్తోంది. కొత్తగా రెండు క్రీడా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో కిన్నెరసాని క్రీడా గురుకుల పాఠశాల అందుబాటులో ఉంది. అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి.
ఈ పాఠశాలలో ఎక్కువగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్యార్థులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూరు, ఏటూరునాగరం ఐటీడీఏల పరిధిలోనూ ఒక్కో క్రీడా గురుకులాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. గిరిజన విద్యార్థులు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటంతో వారు క్రీడల్లో రాణించగలరని భావిస్తోంది.
దీంతో కొత్తగా ఆదిలాబాద్ జిల్లా బోథ్, ఏటూరునాగరంలో రెండు క్రీడా గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించి ప్రతిపాదనలను గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. కొత్తగా ప్రారంభించనున్న రెండు క్రీడా గురుకులాలు 2018–19 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. అక్కడ మైదానం, క్రీడా సామగ్రి తదితర సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది.
తొలి ఏడాది ఒక్కో గురుకులానికి రూ.కోటి చొప్పున తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కిన్నెరసాని క్రీడా గురుకులాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు తయారు చేస్తోంది. విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ నవీన్‌నికోలస్ ‘సాక్షి’తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment