ఒకేరోజు.. 169 గురుకులాలు
- రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభం: సీఎం కేసీఆర్
- దేశ చరిత్రలోనే ఇది రికార్డు.. అధికారులకు అభినందనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకే రోజు 169 గురుకులాలను ప్రారంభించామని.. దేశ చరిత్రలోనే ఇది రికార్డు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ‘కేజీ టు పీజీ’లో భాగంగా పేద విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను ఉచితంగా అందించేందుకే గురుకులాలను ప్రారంభించామని సోమవారం ఓ ప్రకటనలో చెప్పారు. తాజా విద్యా సంవత్సరంలో కొత్తగా 255 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు.
అందులో 169 స్కూళ్లను రికార్డు స్థాయిలో ఒకేరోజు ప్రారంభించేలా కృషి చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి 259 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవని.. తాము కేవలం మూడేళ్లలో కొత్తగా 527 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని పేర్కొన్నారు. బాలికల విద్యను ప్రోత్సహిం చేందుకు సగం స్కూళ్లను వారికే కేటాయించామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వివరించారు.
భారీగా గురుకులాలు
తెలంగాణ ఏర్పాటుకాక ముందు ఎస్సీలకు 134 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పాటైన మరుసటి సంవత్సరమే ఎస్సీలకు 104 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ రెసిడెన్షియల్స్ ప్రారంభించారు. ఇక తెలంగాణ రాకముందు ఎస్టీలకు 94 రెసిడెన్షియల్స్ ఉండేవి. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా 51 రెసిడెన్షియల్స్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీసీలకు కేవలం 19 రెసిడెన్షియల్స్ ఉండగా.. ఇప్పుడు కొత్తగా 119 రెసిడెన్షియల్స్ ప్రారంభమవుతున్నాయి.
బీసీ విద్యార్థులకు ప్రయోజనకరంగా..
రాష్ట్రంలో సోమవారం ఒకేరోజు 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో 56 బాలురకు, 63 బాలికలకు కేటాయించారు. తొలి ఏడాది 5, 6, 7 తరగతుల్లో.. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి ఏడాది ఒక్కో రెసిడెన్షియల్లో 240 మందికి ప్రవేశం కల్పించారు. ఐదేళ్లపాటు ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో రెసిడెన్షియల్లో విద్యార్థుల సంఖ్య 640కు చేరుతుంది. ఐదేళ్లలో మొత్తం బీసీ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య 91,520కు చేరుకుంటుంది. ఇక ప్రస్తుతం మైనారిటీ విద్యాసంస్థల్లో 50 వేల మందికి ప్రవేశం కల్పించగా.. ఐదేళ్లలో ఈ సంఖ్య లక్షా 30 వేలకు చేరుతుంది. కాగా ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకుని స్కూళ్లు ప్రారంభించారు. వీటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం స్థలం సేకరించాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
వారంలో మరో 71 గురుకులాలు..
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభంకాగా.. అందులో 119 బీసీ, 50 మైనారిటీ స్కూళ్లు ఉన్నాయి. ఈ నెల 15న మరో 50, 19న ఇంకో 21 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలను సైతం ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించనున్నారు. ఈ స్కూళ్లకు 24 వేల మంది అధ్యాపకులు అవసరమని అంచనా. వారిని దశల వారీగా నియమించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.